టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అర్హతలున్నాయి: ఏపీ హైకోర్టు
- ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఏ అధికారిగా ధర్మారెడ్డి
- 2019లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన వైనం
- టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అర్హతలు లేవంటూ హైకోర్టులో పిటిషన్
- జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అధికారులే అర్హులన్న పిటిషనర్
- జిల్లా కలెక్టర్, దానికి సమానమైన హోదాలో రాష్ట్రంలో పనిచేసినా సరిపోతుందన్న హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డికి… ఆ పోస్టులో కొనసాగే అర్హత లేదన్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ నవీన్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈవోగా పదవి చేపట్టేందుకు ఉండాల్సిన అర్హతలన్నీ ధర్మారెడ్డికి ఉన్నాయని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ధర్మారెడ్డి… ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఏ అధికారిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో 2019లో ధర్మారెడ్డిని ఏపీకి డిప్యుటేషన్ మీద పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి వచ్చిన ధర్మారెడ్డిని వైసీపీ సర్కారు టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగానూ ప్రమోట్ చేసింది.
అయితే జిల్లా కలెక్టర్ స్థాయి అర్హత కలిగిన అధికారులనే టీటీడీ ఈవోగా నియమించాలని, ఈ విషయంలో ధర్మారెడ్డికి ఆ అర్హత లేదని, ధర్మారెడ్డిని ఆ పోస్టులో నుంచి తొలగించాలని కోరుతూ నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ధర్మారెడ్డి డిప్యుటేషన్ కూడా పూర్తి అయిన విషయాన్ని ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణమోహన్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్… జిల్లా కలెక్టర్‌గానే కాకుండా దానికి సమాన హోదాలో రాష్ట్రంలో పనిచేసిన అధికారి కూడా టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత ఉంటుందని చెప్పింది. నవీన్ కుమార్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.