అత్తమామల సన్నిహిత వీడియోలు తీసి.. భర్తను బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్య!
- ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఘటన
- భార్యాభర్తల మధ్య గొడవలు
- ఒకే ఇంట్లో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్న వైనం
- తన వివాహేతర సంబంధం బయటపడడంతో ప్రియుడితో కలిసి పరారీ
ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న కోటి రూపాయలకు పైగా ఊడ్చేసి వెళ్లిపోయిన ఓ మహిళ.. తనపై కేసును వెనక్కి తీసుకోకుంటే అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని భర్తను బెదిరించింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఆభరణాల వ్యాపారికి భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. దీంతో నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భర్త గ్రహించాడు. విషయం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంది. వన్ ఫైన్ డే ప్రియుడితో కలిసి పరారైంది. వెళ్తూవెళ్తూ ఇంట్లో ఉన్న కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదును దోచుకుంది. దీంతో భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనపై కేసు నమోదైందని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితురాలు భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. వెంటనే కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని హెచ్చరించింది. ఈ విషయాన్ని కూడా ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.