కొడవళ్ళతో దోస్తీ… గులాబీ లో కలవరం ….
మదనపడుతున్న టీఆర్ యస్ నేతలు
ఖమ్మం ,నల్లగొండ జిల్లాలపై ప్రభావం
*సీట్లు రాకపోతే గులాబీ నేతలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం
తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు మునుగోడుకు ఉపఎన్నిక జరగాల్సిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో ఎర్రజెండా పార్టీలను చేరదీయటం ద్వారా మునుగోడులో గెలవాలని టీఆర్ యస్ పథకరచన చేస్తుంది. ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టులతో చర్చలు జరిపి వారిని ఒప్పించిన కేసీఆర్, 2018 ఎన్నికల్లో సైతం వారితో కలిసి పోటీచేసేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది .ఇది కొంతమంది టీఆర్ యస్ నేతలకు నచ్చడం లేదు . ప్రధానంగా ఖమ్మం , నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టులకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా నియోజకవర్గాల నాయకులు మదనపడుతున్నారు . కమ్యూనిస్టులతో పొత్తుకు ఇష్టపడటం లేదు . టీఆర్ యస్ లో సీట్లు ఆశిస్తున్న నాయకులకు సీట్లు రాకపోతే ఇతర పార్టీల వైపు చూసే అవకాశాలు తోసిపుచ్చలేమని రాజకీయపరిశీలకుల అభిప్రాయం
టీఆర్ యస్ మునుగోడు ఎన్నికల్లో గెలవడం ద్వారా తమ సత్తా చాటాలని చూస్తుంది.అదే సందర్భంలో 2023 ఎన్నికల్లో తమదే అధికారం అంటున్న బీజేపీ తమ శక్తి యుక్తులను ఉపయోగించి మునుగోడులో గెలిచి తెలంగాణ లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు వేస్తుంది.
మునుగోడు తప్పక గెలవాల్సిన పరిస్థితి టీఆర్ యస్ కు ఏర్పడటంతో దాని గెలుపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు . అందులో భాగంగా ఉభయ కమ్యూనిస్టులను దగ్గరకు తీసుకున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి . వారు కూడా కేసీఆర్ పిలిచింది తడువుగా వెంటనే మునుగోడులో బీజేపీ ఓటమి కోసం టీఆర్ యస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు . అయితే మునుగోడు సంగతి ఎలా ఉన్నా, ఇది కొన్ని జిల్లాలోని గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తుంది. దీంతో కమ్యూనిస్టులతో దోస్తీ విషయంలో కేసీఆర్ వైఖరిపై జిల్లాలలోని నేతలు మదన పడుతున్నారు . కీంకర్త్యం అంటూ ఆలోచనలు చేస్తున్నారు . తమ రాజకీయదారులు ఎతుక్కునేందుకు సిద్దపడుతున్నారు . ఇప్పటికే టీఆర్ యస్ అధినేత కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు . తనను పార్టీలోకి ఘనంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించినప్పటికీ 2018 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎందుకు ఓడిపోయానో తెలిసినప్పటికీ పక్కనపెట్టి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి తుమ్మల రగిలిపోతున్నారు .
2014 ,2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్కసీటుకే పరిమితమైన టీఆర్ యస్ తరవాత వివిధ పార్టీలనుంచి గెలిచినవారిని తమపార్టీలో చేర్చుకొని జిల్లా రాజకీయాలపై పట్టు సాధించడం పట్ల ప్రజల్లో సానుకూలత కనిపించడంలేదు .2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు , 2018 లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ లు మాత్రమే టీఆర్ యస్ టికెట్ పై విజయం సాధించారు .
గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు ,ఇల్లందు ,కొత్తగూడెం ,పినపాక నియోజవర్గాల నుంచి గెలిచిన కాంగ్రెస్ సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి , హరిప్రియ , వనమా వెంకటేశ్వరరావు ,రేగా కాంతారావు ,వైరా నుంచి గెలిచిన స్వతంత్ర సభ్యుడు రాములు నాయక్ , సత్తుపల్లి , అశ్వారావుపేట నుంచి గెలిచిన టీడీపీ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య , మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకున్నారు . దీంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క , పొదెం వీరయ్య తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అందరు టీఆర్ యస్ లో ఉన్నారు . దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ యస్ కు గాని దానికి మద్దతు ఇచ్చే లెఫ్ట్ పార్టీలకు గాని ఎన్నిసీట్లు ఇస్తారు . టీఆర్ యస్ ఎన్ని పోటీచేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
సిపిఐ పార్టీ రాష్ట్రంలో 25 నుంచి 30 సీట్లకు పోటీచేసేందుకు సిద్ధపడుతుండగా , సిపిఎం కూడా అదే స్థాయిలో పోటీచేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే టీఆర్ యస్ తో కలిసి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు ఖమ్మం ,నల్గొండ జిల్లాల్లో కొంత ప్రభావం ఉంది . ఇక్కడే ఈ పార్టీలు అధిక సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.ఖమ్మం జిల్లాలో సిపిఐ పాలేరు , వైరా , కొత్తగూడెం , పినపాక , భద్రాచలం సిపిఎం పాలేరు , మధిర, ఖమ్మం , భద్రాచలం , వైరా సీట్లలో పోటీచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో మిర్యాలగూడెం , నకిరేకల్లు , నల్గొండ , తుంగతుర్తి , సూర్యాపేట , మునుగోడు , దేవరకొండ ,మరో ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఉభయ కమ్యూనిస్టులు పోటీచేయనున్న . అదే విధంగా ఉమ్మడి వరంగల్ , రంగారెడ్డి , మెదక్ ,మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కమ్యూనిస్టులు ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.