రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి… CI TU
-రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
-కనీస వేతనాల జీవోను అమలు చేయాలి
-రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు చేపట్టాలి
-ప్రమాదాల్లో నష్టపోయిన కార్మికులకు నష్ట పరిహారం చెల్లించాలి
-తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించని కారణంగా స్వయం ఉపాధి కోసం రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం సమగ్రమైన విధానంతో రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని ఆదుకోవాలని,అర్హులైన రవాణా రంగ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ యూనియన్(ఎ.ఐ.ఆర్.టి.డబ్ల్యూ.ఎఫ్ – సిఐటియు అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఉదయం ఖమ్మంలోని మంచికంటి సమావేశ మందిరంలో తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా రెండవ సభలో శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహాసభలో ముందుగా యూనియన్ పతాకాన్ని సీనియర్ ఉపాధ్యక్షులు రామదాసు ఆవిష్కరించగా, ప్రతినిధులందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.అనంతరం అమరవీరులకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు.
మహాసభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు ప్రారంభోపన్యాసం చేస్తూ,దేశాభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే స్థితిలో లేవన్నారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకులు,ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుండి అప్పులు తెచ్చి వాహనాలు కొనుగోలు చేసి రవాణా రంగంలో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకోవడంకోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ పిఎఫ్,ఈఎస్ఐ,పని భద్రత,సరియైన పని గంటలు కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెట్రోలు,డీజిలు,గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ప్రత్యేకించి రవాణారంగ కార్మికులపై పడిందన్నారు.కరోనా విపత్కరకాలంలో రవాణారంగ కార్మికులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ఆలోచించింది ఏమీలేదన్నారు. 2021 జూన్ 30వ తేదీన జీవోఎంఎస్ నెంబర్ 25 ద్వారా కనీస వేతనాన్ని రు.18019/- రూపాయలుగాను, హైస్కిల్డ్ వర్కర్ కు రు.39,837/- రూపాయలు గాను నిర్ణయించారని ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడి మూలంగా ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని గెజిట్ లో పెట్టి కనీస వేతనాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణారంగ కార్మికులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం 13 నెలలు కావస్తున్నప్పటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. రవాణారంగంలో ఆటో, ట్రాక్టర్,లారీ,ట్రాలీ, జీపు,ట్రక్కు,స్కూల్ బస్సు,అంబులెన్స్, హైర్ బస్,డీసీఎం,మినీ డీసీఎం, హార్వెస్టర్, ప్రోక్లైన్, క్యాబ్, తదితర వాహనాలలో పనిచేసే కార్మికులందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాలని, పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని, రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ప్రసంగిస్తూ,తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా రవాణారంగంలో కార్మికులు గా పనిచేస్తున్నారని వారందరికీ రవాణాశాఖ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రోడ్డు ప్రమాదాలు నివారించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని, సుదూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే రవాణారంగ కార్మికుల విశ్రాంతి కోసం జాతీయ రహదారుల పక్కన మౌలిక వసతులతో కూడిన విశ్రాంతి భవనాలు నిర్మించాలని,నగరాలు,పట్టణాల్లో ఆటో అడ్డా ప్రాంతాలలో మౌలిక వసతులతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలన్నారు.వయసు భారమై,అనారోగ్యం పాలై, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి రవాణారంగంలో పనిచేయలేని ప్రతి కార్మికులకు నెలకు రు.3,500 రూపాయలు పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నిత్యం అనేక రకాల వాహనాలు రోడ్ల మీదికి వస్తున్నప్పటికీ వాటిని నడిపేటువంటి సరైన శిక్షణను మాత్రం ఇప్పించలేకపోవడంలో ప్రభుత్వాలు,ఆటోమొబైల్ సంస్థలు అలసత్వం వహించడం శోషనీయం అన్నారు. ప్రతిరోజూ రెక్కాడితే గానీ డొక్కాడని రవాణా రంగ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇళ్ల స్థలాలు, ఆటో ట్రాలీ ట్రక్కు లాంటి వాహనాలు కొనుక్కోవడానికి రుణ సదుపాయం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ మాసంలో ఖమ్మంలో జరుగుతున్నాయని రాష్ట్ర మహాసభల ప్రాధాన్యతను రవాణారంగలో పనిచేస్తున్న కార్మికులందరికీ తెలియజెప్పడం ద్వారా జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా
నూతన కమిటీ ఎన్నిక
నూతన కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా తుమ్మ విష్ణువర్ధన్,జిల్లా ఉపేందర్,కార్య నిర్వాహక అధ్యక్షులుగా వై.విక్రం, కోశాధికారిగా డి.ఉపేందర్,ఉపాధ్యక్షులుగా రామదాసు, వెంకట్,మాధవరావు సహాయ కార్యదర్శులుగా అమరయ్య,మహేష్ తో పాటు మొత్తం 21 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు