ముంబై లీలావతి ఆసుపత్రిలో ఏపీ మంత్రి విశ్వరూప్‌కు కొనసాగుతున్న ఆపరేషన్
- వరుసగా రెండు సార్లు అస్వస్థతకు గురైన విశ్వరూప్
- ఇటీవలే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిక
- విశ్వరూప్ గుండెకు ఆపరేషన్ అవసరమన్న వైద్యులు
- ఉదయం 10 గంటలకు మొదలై కొనసాగుతున్న ఆపరేషన్
గుండె జబ్బు బారిన పడ్డ ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆపరేషన్ మొదలైంది. ఈ ఉదయం 10 గంటలకు విశ్వరూప్ గుండెకు మొదలైన ఆపరేషన్ గంటల తరబడి కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలు దాటినా విశ్వరూప్‌కు ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు.
ఈ నెల 2న వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సందర్భంగా అనారోగ్యానికి గురైన విశ్వరూప్ రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్‌కు పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పిన రోజుల వ్యవధిలోనే ఆయన మరోమారు అనారోగ్యానికి గురి కాగా… మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన లీలావతి ఆసుపత్రి వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ అవసరమని సూచించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో సోమవారం ఉదయం విశ్వరూప్‌కు ఆపరేషన్ మొదలైంది.