కాబూల్ లో ఆత్మాహుతి దాడి… 23 మంది విద్యార్థినుల మృతి!
- కాబూల్ రక్తసిక్తం.. విద్యాసంస్థపై దాడి
- మృతుల్లో అత్యధికులు హజారా తెగ విద్యార్థినులు
- 30 మందికి గాయాలు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఓ విద్యాసంస్థపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు యువతులేనని తెలుస్తోంది. 30 మంది వరకు గాయపడ్డారు. పశ్చిమ కాబూల్ లోని దాష్త్-ఏ-బర్చీ ప్రాంతంలో కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ భారీ విస్ఫోటనంతో దద్దరిల్లింది. ఆ సమయంలో విద్యార్థులు ఓ పరీక్ష రాస్తున్నారు.
కాగా, మృతుల్లో అత్యధికులు మైనారిటీ హాజారా తెగకు చెందినవారిగా గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్ లో హాజారాలు (షియా ముస్లింలు) బలహీనవర్గాలుగా గుర్తింపు పొందారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరచుగా దాడులు చేస్తుంటుంది.
తాజాగా జరిగిన దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. కాగా, దాడి జరిగిన సమయంలో విద్యాసంస్థ ప్రాంగణంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.