బిగ్ బాస్ అశ్లీలతపై ఏపీ హైకోర్టులో విచారణ!
- బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్
- అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టుకు తెలిపిన పిటిషనర్
- ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ ను పాటించడం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది
బిగ్ బాస్ రియాల్టీ షోపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో అసభ్యంగా ఉంటోందని కొందరు… బూతుల స్వర్గమని మరి కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు ఈ షోను బ్యాన్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కోర్టులో విచారణ సందర్భంగా… ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి తన వాదనలను వినిపించారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ ను టీవీ షోలు పాటించడం లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో అశ్లీలతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా? అని ప్రశ్నించింది. అయితే, దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసు ఇచ్చే విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.