‘విల్లంబు’ ఫ్రీజ్!.. కొత్త గుర్తులు ఎంచుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు ఈసీ ఆదేశం!
- శివసేనను చీల్చిన సీఎం ఏక్‌నాథ్ షిండే
- శివసేన కోసం, పార్టీ గుర్తు కోసం ఉద్ధవ్, షిండే వర్గాల మధ్య వివాదం
- ఎల్లుండి లోగా ఇతర గుర్తులు ఎంచుకోవాలని ఈసీ ఆదేశం
మహారాష్ట్ర రాజకీయాల్లో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అటు శివసేనతో పాటు శివసేన చీలిక వర్గమైన సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్న షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివసేన తమదంటే కాదు… తమదని మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, షిండే వర్గాలు వాదులాడుకుంటున్నాయి. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.
తాజాగా శనివారం ఉద్ధవ్‌తో పాటు షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ నోటీసు జారీ చేసింది. శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని… అది కూడా రెండు రోజుల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.