రెండు బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష: అప్రమత్తమైన జపాన్!
- జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు నిద్రను దూరం చేస్తున్న ఉత్తర కొరియా
- ఆరు నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణులను పరీక్షించిన నార్త్ కొరియా
- అత్యవసర హెచ్చరిక జారీ చేసిన జపాన్ ప్రధాని
- స్వీయ రక్షణ కోసమేనన్న ఉత్తర కొరియా
- ఈ ఏడాది ఇది 24వ పరీక్ష కావడం గమనార్హం
జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న ఉత్తర కొరియా మరోమారు చెలరేగింది. నిన్న రెండు బాలిస్టిక్ మిసైళ్లను పరీక్షించింది. ఇటీవలి కాలంలో ఇది ఏడో ప్రయోగం కావడం గమనార్హం. ఈ క్షిపణులు 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ 350 కిలోమీటర్లు ప్రయాణించినట్టు జపాన్ రక్షణ మంత్రి తోషిరో ఇనో పేర్కొన్నారు. ఇందులో ఒకదానిని అర్ధరాత్రి దాటిన తర్వాత 1.47 గంటలకు పరీక్షిస్తే, మరో దానిని ఆరు నిమిషాల తర్వాత ప్రయోగించారు.
నార్త్ కొరియా క్షిపణులను పరీక్షించిన వెంటనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా మిలటరీ స్పందిస్తూ ఈ విషయమై తమ మిత్రపక్షాలను సంప్రదిస్తున్నట్టు తెలిపింది. ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్య తప్ప మరోటి కాదని, శాంతికి ఇది విఘాతం కలిగిస్తుందని దక్షిణ కొరియా మిలటరీ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఐదు సంవత్సరాల తర్వాత గత మంగళవారం జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణిని ప్రయోగించి కలకలం రేపింది. తాజా క్షిపణి పరీక్షతో ఉత్తర కొరియా ఈ ఏడాది చేసిన పరీక్షల సంఖ్య 24కు చేరుకుంది.
ఐక్యరాజ్య సమితి ఆంక్షలను కాదని క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నార్త్ కొరియా.. తమ పరీక్షలు సర్వసాధారణమైనవేనని, అమెరికా మిలటరీ బెదిరింపుల నుంచి స్వీయ రక్షణ కోసం, ఈ ప్రాంత శాంతి కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పడం గమనార్హం.