ములాయం మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం!
- దేశానికి తీరని నష్టమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- దేశ రాజకీయాల్లో ములాయంకు ప్రత్యేక స్థానమన్న ప్రధాని
- ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడిన సైనికుడిగా అభివర్ణణ
ములాయం మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు.
ములాయం మరణం దేశానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ములాయం మరణం పట్ల ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైతం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
‘‘యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అత్యవసర కాలంలో (ఎమర్జెన్సీ) ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన సైనికుల్లో మఖ్యమైన నేత. రక్షణ మంత్రిగా భారత్ ను బలోపేతం చేశారు. పార్లమెంటు చర్చల్లో ఆయన ప్రమేయం అంతర్ దృష్టితో, దేశ ప్రయోజన హితంగా ఉండేది.
మేము మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న సమయంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సన్నిహిత సంబంధం అలాగే కొనసాగింది. ఆయన అభిప్రాయాలు వినడానికి నేను ఎప్పుడూ ఆసక్తి చూపేవాడిని. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, ఆయన లక్షలాది మద్దతుదారులకు నా సంతాపం. ఓం శాంతి’’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
బీహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉంటాయన్నారు.
‘‘యూపీ మాజీ ముఖ్యమంత్రి, సామాజిక నేత శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకు దేవుడు తన పాదాల వద్ద చోటు ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి’’అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ములాయం మరణం తీరని నష్టమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
తుది శ్వాస విడిచిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్
- గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూత
- ఫలించని వైద్యుల ప్రయత్నాలు
- ప్రతి ఒక్కరి నేత ఇక లేరంటూ అఖిలేశ్ యాదవ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆగస్ట్ చివరి నుంచి గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో ములాయం చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో ఈ నెల 2న ఆయన్ను ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల కిందటే పరిస్థితి మరింత విషమించింది. దీంతో ప్రాణాధార ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. అయినా ఉపయోగం లేకపోయింది.
‘‘నా గౌరవ తండ్రి, ప్రతి ఒక్కరి నేత ఇక లేరు’’అంటూ ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పై చిన్న సందేశాన్ని హిందీలో పోస్ట్ చేశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, మూత్రనాళ ఇన్ఫెక్షన్ సైతం ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అఖిలేశ్ యాదవ్ తన భార్య డింపుల్ తో కలసి మేదాంత హాస్పిటల్ కు చేరుకున్నారు.