మాజీ ఎమ్మెల్యేపై వేటు వేసిన జగన్!
-పొన్నూరు వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు
-ఎమ్మెల్యే కిలారి, మాజీ ఎమ్మెల్యే రావి వర్గాల మధ్య విభేదాలు
-రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్
గీతదాటితే వేటు తప్పదని ఏపీ సీఎం జగన్ తన పార్టీ శ్రేణులకు గతంలోనే హెచ్చరికలు జారీచేశారు . అయినప్పటికీ అనేకమంది క్రమశిక్షణను పాటించటంలేదు . ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ఇతర నాయకులూ అప్పుడప్పుడు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా మాట్లాడిన సందర్భాలు చూశాం . కానీ ఎప్పడు చర్యలు తీసుకోలేదు . కానీ ఇప్పడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా తరణంలో పార్టీ నాయకులకు ఒక సందేశం పంపారు . పార్టీలో ఎంతటివారైనా గీతదాటితే వేటుతప్పదని సంకేతాన్ని ఇచ్చారు . పొన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పై వేటు వేశారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య , వెంకటరమణ కు మధ్య పొసగటంలేదు . దీంతో పార్టీ అధ్యక్షుడు , సీఎం వైఎస్ జగన్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్స్ మేరకు వేటు వేశారు .
వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించే వారిని ఉపేక్షించబోనని గతంలోనే హెచ్చరించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అన్నంత పని చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ‘పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు… గుంటూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటరమణని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది’ అంటూ ప్రకటనలో వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై దాడి వ్యవహారం ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచింది. ఈ క్రమంలో రావి వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో రావి వెంకటరమణపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేసింది.