వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ
- హిందూపురంలో వరదలు
- బాలకృష్ణ పర్యటన
- కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోయాయన్న బాలయ్య
- అందుకే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం వరద ప్రాంతాల్లో పర్యటించానని, బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు కోరారని వెల్లడించారు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. బ్రిడ్జిల నిర్మాణంపై ప్రభుత్వం స్పందించకపోతే, టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోవడం వల్లే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడించారు.
బాలయ్య తన పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. త్యాగరాజనగర్, చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో వరద బాధితులకు ఆహారం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు.
అంతేకాదు, తన అభిమానుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి కూడా బాలకృష్ణ హాజరయ్యారు. వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.