ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు… వారు ధనవంతులు కావడంలేదా?: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం!
- హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేసిన లలన్ పాశ్వాన్
- నమ్మితే దేవత, నమ్మకపోతే రాతి శిల మాత్రమే అని వెల్లడి
- ఇలాంటి నమ్మకాలు విడనాడాలని పిలుపు
- అప్పుడే మేధస్సు వికసిస్తుందని వ్యాఖ్యలు
- భాగల్ పూర్ లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ హిందూ దేవతలపైనా, హిందూ మత విశ్వాసాలపైనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీపావళి నాడు హిందువులు లక్ష్మీదేవిని పూజించడంపై ఆయన విమర్శనాత్మకంగా స్పందించారు.
“మనం (హిందువులు) కేవలం లక్ష్మీదేవిని పూజించడం వల్లే ధనవంతులం అయితే, ముస్లింలలో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఎవరూ ఉండరు. ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు… మరి వారు ధనవంతులు కావడంలేదా? ముస్లింలు సరస్వతీదేవిని ఆరాధించరు… మరి వారు ఐఏఎస్, ఐపీఎస్ లు అవడంలేదా? మనం భజరంగబలి అని స్తుతిస్తే బలవంతులం అవుతామని నమ్ముతాం. ముస్లింలు, క్రిస్టియన్లు భజరంగబలి అనరు… మరి వారిలో బలవంతులు లేరా?” అని లలన్ పాశ్వాన్ ప్రశ్నించారు.
ఆత్మ, పరమాత్మ అనే భావన కేవలం ప్రజల నమ్మకం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. “మీరు ఓ విగ్రహాన్ని నమ్మితే అది దేవత… నమ్మకపోతే అది ఓ రాతి శిల మాత్రమే. నమ్మకం అనేది ఒక్కొక్కరి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా శాస్త్రీయ ప్రాతిపదికన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి నమ్మకాలను విడనాడితే మనిషిలో మేధో సంపత్తి పెరుగుతుంది” అని పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.