Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రిటర్నింగ్ అధికారిని తప్పించిన ఈసీ చర్యను తప్పుబట్టిన కేటీఆర్!

రిటర్నింగ్ అధికారిని తప్పించిన ఈసీ చర్యను తప్పుబట్టిన కేటీఆర్
-ఎన్నికలో గుర్తు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై సీఈసీ ఆగ్రహం
-రోడ్డు రోలర్ గుర్తు తొలగింపు వ్యవహారంలో రిటర్నింగ్ అధికారిపై వేటు
-ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్న కేటీఆర్
-తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును 2011లోనే తొలగించారని వెల్లడి
-తొలగించిన గుర్తును తిరిగి ఎలా ప్రవేశపెడతారంటూ ఆగ్రహం
-రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ
-మునుగోడు కొత్త రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఏ రీతిన దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని కూడా ఆయన అన్నారు.

గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం తొలగించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకసారి రద్దు చేసిన గుర్తును తిరిగి మరోమారు ఆ గుర్తును ఎన్నికల్లోకి ప్రవేశపెట్టడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. తమ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులతో ఓటర్లను అకయోమయానికి గురి చేసి దొడ్డిదారిన లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఎన్నికలో గుర్తు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై సీఈసీ ఆగ్రహం

మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులకు సంబంధించి మరో వివాదం చోటుచేసుకుంది. తమ గుర్తు కారును పోలిన విధంగా మరి కొన్ని గుర్తులు ఉన్నాయని… వాటిని తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజాగా రోడ్ రోలర్ గుర్తు విషయంలో వివాదం నెలకొంది. యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. అయితే, తాజాగా ఈ గుర్తును మార్చి వేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మునుగోడు కొత్త రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్

మునుగోడు ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓగా పనిచేస్తున్న రోహిత్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల
సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు రోలర్ గుర్తు తొలగింపునకు సంబంధించి నెలకొన్న వివాదంలో గురువారం వెంటవెంటనే చర్యలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటిదాకా రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ క్రమంలో తమ ప్రతినిధిని నేరుగా మునుగోడు పంపి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసింది.

ఎన్నికల సంఘం ప్రతినిధి పంపిన నివేదిక ఆధారంగా ఈసీ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలగింపునకు గురైన రోడ్లు రోలర్ గుర్తును పునరుద్ధరించింది. అంతేకాకుండా ఆ గుర్తును తొలగించిన రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది. ఆ వెంటనే కొత్త రిటర్నింగ్ అధికారి ఎంపిక కోసం ముగ్గురు అధికారుల పేర్లను సూచించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)ని కోరింది. సీఈఓ పంపిన జాబితాను పరిశీలించిన ఈసీ… మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా పనిచేస్తున్న రోహిత్ సింగ్ ను మునుగోడు నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది.

 

Related posts

తెలంగాణలో బీజేపీ బాణాలు, పార్టీలు నడవవు: హరీశ్ రావు!

Drukpadam

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్….

Drukpadam

నిధులు మళ్లించటంలో టీడీపీ ,వైసీపీ దొందు దొందే …బీజేపీ ఎంపీ జీవీఎల్!

Drukpadam

Leave a Comment