కొత్తగూడెం సీటుపై పలువురి కన్ను …తానే పోటీ చేస్తానంటున్న వనమా !
-జలగం ,పొంగులేటి ,కూనంనేని,డాక్టర్ గడల శ్రీనివాస్ కి కొత్తగూడెం పై ఆశలు
-టీఆర్ యస్, సిపిఐ పొత్తులో సీటు తమదే అంటున్న సిపిఐ
-కేసీఆర్ తో జలగం భేటీ …కేటీఆర్ తో పొంగులేటి మంతనాలు
-వనమా కుటుంబానికి సీటు రాకపోతే టీఆర్ యస్ కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ జనరల్ సీటుపై పలువురి కన్నుపడింది. ప్రధానంగా అధికార టీఆర్ యస్ నుంచి ఈ సీటుకోసం హోరాహోరీగా పైరవీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి 2018 లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు . అయితే ఆయన వయసు పైబడినందున కొత్తవారికోసం చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వనమా తరవాత ఆయన కుమారుడు వనమా రాఘవకు అవకాశం ఉంటుందని అనుకున్నారు .కానీ ఒక కుటుంబ ఆత్మహత్య ఆయన వల్లనే జరిగిందని ఆరోపణలతో కేసులో ఇరుక్కున్నారు. రాఘవ డైనమిక్ లీడర్ గా ఉన్న ఆయనపై జరిగిన ప్రచారం మైనస్ గా మారింది. దీంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారు . అయినప్పటికీ రాఘవ కనుసన్నల్లోనే కొత్తగూడెం అధికార రాజకీయాలు నడుస్తున్నాయి.
వనమా వెంకటేశ్వరరావు కాకపోతే వనమా రాఘవకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీఆర్ యస్ వర్గాలే అంటున్నాయి. అప్పడు కొత్తగూడెం అధికార టీఆర్ యస్ అభ్యర్థి ఎవరు అవుతారు ? అనేది ఆసక్తిగా మారింది . వామపక్షాలతో పొత్తు ఉంటె సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కు సీటు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ సిపిఐ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది . మరో వాదన కూడా ఉంది సిపిఐ సాంబశివరావు కు ఎమ్మెల్సీ ఇచ్చి కొత్తగూడెం నుంచి టీఆర్ యస్ పోటీచేస్తుందని కూడా అంటున్నారు .
అయితే టీఆర్ యస్ లో ఈ సీటు కోసం చాలామంది క్యూలో ఉన్నారు . ఇప్పటివరకైతే అంట వెయిటింగ్ లిస్ట్ … మరో విషయం ఏమంటే చాలాకాలం నుంచి కల్వకుంట్ల కుటుంబంతో దూరంగా ఉంటున్న జలగం వెంకటరావును ఇటీవలనే కేసీఆర్ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తుంది. అందువల్ల తిరిగి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని టీఆర్ యస్ సీనియర్ నాయకులే అంటున్నారు . పైగా ఆయనకు జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడిగా మంచి గుర్తింపు ఉంది. ఇక మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కొత్తగూడెం పై కేంద్రీకరించాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది కేటీఆర్ చెప్పాడని ఆయన అండదండలు ఉన్నాయని పొంగులేటి ఉన్నాయని సమాచారం . మరో వ్యక్తి ఖమ్మ జిల్లాకు చెందిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డైరక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ గడల శ్రీనివాస్ రావు కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన తరచూ కొత్తగూడెం పర్యటనలు జరపడం అక్కడ అభిమాన సంఘాలను ఏర్పాటు చేయడం ,సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ఆయన తన పలుకుబడిని ఉపయోగించి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు .
మరో ఒకరిద్దరు కూడా తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు బయలుదేరాయి. వనమా కుటుంబాన్ని కాదని ఎవరికి టికెట్ ఇచ్చిన టీఆర్ యస్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు . చూద్దాం ఏమి జరుగుతుందో మరి…!