Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమిత్ షాను విసిగించిన హర్యానా హోం మంత్రి!

స్టేజ్​ పై అమిత్ షాను విసిగించిన హర్యానా హోం మంత్రి!

  • సుదీర్ఘంగా ప్రసంగించడంతో అసహనం వ్యక్తం చేసిన షా
  • నాలుగుసార్లు చెప్పినా వినకపోవడంతో అనిల్ విజ్ కు మందలింపు
  • హర్యానాలోని సూరజ కుండ్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో ఘటన

హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగంగానే ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అనిల్ ఎనిమిదిన్నర నిమిషాలు ప్రసంగించగా.. షా ఆయనకు నాలుగుసార్లు అంతరాయం కలిగించారు. మాట్లాడేందుకు ఆయనకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.

హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఇందులో విజ్ స్వాగత ఉపన్యాసం చేశారు. హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి దాని సహకారం, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరించసాగారు. అలాగే, తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్ గురించి కూడా మాట్లాడారు.

కొన్ని సీట్ల దూరంలో ఉన్న అమిత్ షా.. తొందరగా ముగించాలని సదరు మంత్రికి ఒక నోట్ పంపారు. కానీ, విజ్ పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించాడు. దాంతో, మైక్ ఆన్ చేసిన అమిత్ షా విజ్ కు సైగ చేశారు. అయినా రాష్ట్ర హోంమంత్రి ప్రసంగం ఆపలేదు. చివరకు అమిత్ షా కల్పించుకొని ‘అనిల్ జీ మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారు. దయచేసి ముగించండి. ఇంత సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఇది వేదిక కాదు’ అని చెప్పారు.

అయితే, మరో పాయింట్ చెప్పాలంటూ అనిల్ విజ్ ఇంకాస్త సమయం అడిగారు. షా అంగీకరించడంతో విజ్ తమ రాష్ట్ర విజయాల సుదీర్ఘ జాబితాను వివరించడం కొనసాగించారు. దాంతో, అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘అనిల్ జీ దయచేసి నన్ను క్షమించండి. ఇది పని చేయదు. ముగించండి’ అని చెప్పారు.

అక్కడితో ఆగకుండా విజ్ ముగింపు వ్యాఖ్యలు చెప్పడం మొదలు పెట్టడంతో అమిత్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోయింది.. సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు. షా స్పందన తర్వాత హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన ప్రసంగాన్ని మూడు నిమిషాల్లో ముగించడం విశేషం.

Related posts

కర్నూలు జిల్లాలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్య

Ram Narayana

పట్టువదలని టెకీ.. 150 సంస్థలు తిరస్కరించినా ఎట్టకేలకు జాబ్

Drukpadam

కల్లాల లో ఉన్న ధాన్యం నిల్వలను సత్వరం కొనుగుళ్ళుకు ఏర్పాటు చేయండి:ఎమ్మెల్యే సండ్ర

Drukpadam

Leave a Comment