ఇచ్చిన మాటకు కట్టుబడి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను: కేటీఆర్
- మునుగోడులో ఎగిరిన గులాబీ జెండా
- టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం
- అభినందనలు తెలిపిన కేటీఆర్
- నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తిచేస్తామని వెల్లడి
మునుగోడు ఉప ఎన్నికలో తమ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో స్పందిస్తూ, మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినందుకు మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ పనులు పూర్తిచేయడంపై దృష్టిసారిస్తామని తెలిపారు.
అంతకుముందు, మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్… మునుగోడులో గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగందని వెల్లడించారు. క్రితంసారి టీఆర్ఎస్ కు 34.29 శాతం ఓట్లు లభించాయని, ఈసారి ఓట్ల శాతం 43కి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన గుర్తుకు 6 వేల ఓట్లు పడ్డాయని, లేకపోతే టీఆర్ఎస్ మెజారిటీ మరింత పెరిగేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ నాటకాలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. అనేక తప్పుడు ప్రచారాలు చేసినా, టీఆర్ఎస్ మెజారిటీని తగ్గించగలిగారేమో కానీ, విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారని కేటీఆర్ పేర్కొన్నారు.