పురుషులలో ఈ సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే!
- ఉదయం కూడా అలసటగా అనిపిస్తుంటే అశ్రద్ధ పనికిరాదు
- ఉన్నట్టుండి బరువు తగ్గిపోతే కారణాలు తెలుసుకోవాల్సిందే
- మలం, మూత్రాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి
చాలా మంది అత్యవసర పరిస్థితి ఏర్పడితే కానీ, వైద్యులను కలుసుకోరు. మూడింట రెండొంతులు మంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటూ ఉంటారట. తమకు తాము ధైర్యం చెప్పుకుని, సానుకూల దృక్పథంతో ఉంటే మంచిదే. అలా అని, ముఖ్యమైన ఆరోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ అసలే పనికిరాదు. పురుషుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దన్నది వైద్యుల సూచన.
తీవ్ర అలసట
రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించిన తర్వాత వచ్చే అలసట గురించి ఆందోళన చెందక్కర్లేదు. కానీ, రాత్రి తగినంత సమయం నిద్ర పోయిన తర్వాత.. ఉదయం వేళల్లోనూ అలసట కనిపిస్తుంటే లైట్ గా తీసుకోవద్దు. ఎందుకంటే స్లీప్ అప్నియాకు ఇది సంకేతం కావచ్చు. స్లీప్ అప్నియాలో శ్వాస సరిగ్గా అందదు. శ్వాస మార్గంలో అడ్డంకులు ఏర్పడడం వల్ల.. ఆగి, ఆగి (విరామంతో) గాలి తీసుకుంటూ ఉంటారు. గురక పెడుతుంటారు. దీనివల్ల మంచి నిద్ర లేక అలసట అనిపిస్తుంది. స్లీప్ అప్నియాను నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులకు దారితీయవచ్చు. అధిక బరువు ఎక్కువగా ఈ పరిస్థితికి కారణమవుతుంది. అంతేకాదు, అధిక బరువుతో రక్తపోటు, ఇతర సమస్యలు కూడా రావచ్చు.
బరువు తగ్గిపోవడం
సాధారణంగా 3-5 కిలోల బరువు తగ్గడం పెద్ద ప్రమాద సంకేతం కాబోదు. కానీ, స్వల్ప కాలంలోనే 10 కిలోలు, అంతకుమించి బరువు మీ ప్రమేయం లేకుండా తగ్గిపోతే కనుక వెంటనే మేల్కొని వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కేన్సర్ సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. ముఖ్యంగా లంగ్ కేన్సర్, గ్యాస్ట్రో కేన్సర్ లలో (పాంక్రియాస్, కొలన్, రెక్టమ్ కేన్సర్) ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చు. ఒకవేళ మధుమేహం కారణంగానూ ఇలా జరగొచ్చు. సాధారణంగా మన శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చుకుంటుంది. ఆహారం ద్వారా లభించే కార్బోహైడ్రేట్స్ ను శక్తిగా మార్చుకోలేనప్పుడు.. శరీరం నిల్వ చేసి ఉంచిన కొవ్వులను వాడేసుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన సెలియాక్ డిసీజ్ లోనూ ఇలా జరగొచ్చు. గ్లూటెన్ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించదు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చు.
మూత్రం, మలం
అప్పుడప్పుడు అయినా ప్రతి ఒక్కరూ తమ మూత్రం రంగు, మలం రంగును పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వీటి రూపంలో సంకేతాలు కనిపిస్తాయి. మూత్రం ముదురు రంగులోకి మారిపోతే బైలురూబిన్ సమస్యలు ఉండొచ్చు. కొలరెక్టల్ కేన్సర్ లో మలం రంగు, పరిమాణం తదితర మార్పులు కనిపిస్తాయి. మలంలో రక్తం కనిపిస్తుంటే అది కేన్సర్ సంకేతం అయి ఉండొచ్చు. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే అధి మధుమేహానికి సంకేతంగా.. ఒకేసారి మొత్తం మూత్రాన్ని పోయలేక, వెంట వెంట కొద్ది కొద్దిగానే వస్తుంటే ప్రొస్టేట్ సమస్యలు ఉన్నట్టు అనుమానించొచ్చు.
చిరాకు..
తరచూ చిరాకు పడుతున్నారా..? అయితే అలా చిరాకు పడడానికి తగిన కారణాలు ఉన్నాయా? లేక అనవసరంగా చిరాకు వస్తోందా? పరిశీలించుకోవాలి. టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినప్పుడు, ఆందోళన వల్ల కూడా ఇలా చిరాకు అనిపిస్తుంది.