భారత్ లో ఎంట్రీ ఇస్తున్న చైనా బైకులు!
- భారత్ లో అరంగేట్రం చేస్తున్న క్యూజే మోటార్
- త్వరలోనే నాలుగు బైకుల విడుదల
- భారతీయులు ఆదరిస్తారని క్యూజే మోటార్ విశ్వాసం
ఇప్పటిదాకా చైనా బొమ్మలు, చైనా ఎలక్ట్రానిక్ వస్తువులు, చైనా ఫోన్లు చూసిన భారతీయులు త్వరలోనే చైనా బైకులను కూడా చూడనున్నారు. చైనా మోటార్ సైకిల్ తయారీ దిగ్గజం క్యూజే మోటార్ (కియాంగ్ జియాంగ్ మోటార్ సైకిల్) త్వరలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. తొలి దశలో నాలుగు బైకులతో భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.
తమ ఎస్సార్సీ 250, ఎస్సార్సీ 500, ఎస్సార్వీ 300, ఎస్సార్కే 400 మోడళ్లు భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటాయని క్యూజే మోటార్ భావిస్తోంది. ఎస్సార్సీ 250 రెట్రో లుక్ మోటార్ సైకిల్ కాగా, ఎస్సార్వీ 300 ఓ క్రూయిజర్ బైక్.
ఎస్సార్కే 400 మిడిల్ వెయిట్ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్ కు చెందిన బైక్. ఇక, ఎస్సార్సీ 500 లుక్ చూస్తే బెనెల్లీ ఇంపీరియల్ 400ను పోలి ఉంటుంది.
ఈ చైనా ఆటోమొబైల్ సంస్థ భారత్ లో ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా సంస్థతో జట్టుకట్టింది. క్యూజే మోటార్ సంస్థ ఝెజియాంగ్ గీలీ హోల్డింగ్ గ్రూప్ కు అనుబంధ సంస్థ. కాగా, క్యూజే మోటార్ సొంతంగా మోటార్ బైకులు తయారుచేయడమే కాదు…. కీవే, బెనెల్లి వంటి ప్రపంచస్థాయి బ్రాండ్లను కూడా సొంతం చేసుకుంది.