బస్టేషన్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ!
వలస కార్మికుల తిరుగుప్రయాణం
వర్క్ ఫ్రొం హోమ్ తో ఐ టి కంపెనీల ఉద్యోగులు సైతం సొంతూళ్లకు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పోటెత్తుతున్న ప్రయాణికులు!
నగరం నుంచి వలస పోతున్న వలస జీవులు
వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో సొంతూళ్ల బాట పడుతున్న ఉద్యోగులు
10 రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగిందంటున్న రైల్వే అధికారులు
సెకండ్ వేవ్ కరోనా ఉద్ధృతి తీవ్రరూపం దాలుస్తుండటంతో పాటు, వేసవి కాలం కూడా కావడంతో హైదరాబాద్ నగర జీవులు తమ సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. లాక్ డౌన్ విధించబోతున్నారనే వార్తలతో ముందు జాగ్రత్తగా నగరాన్ని వీడుతున్నారు. దీంతో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. గత 10 పది రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగిందని రైల్వే అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారని వారు తెలిపారు. తిరిగి నగరం ఖాళీ అవుతుందా అన్నంతగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. దీనితో మళ్ళీ నిర్మాణరంగంలో పాటు ఇతరరంగాలపై కూడా దీని ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రైల్వే స్టేషన్లు ,బస్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి .
అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, నగరంలో ఉండి ఇబ్బంది పడే దానికంటే సొంతూరికి వెళ్లడమే బెటర్ అనే ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా నగరంలో ఉన్న లక్షలాది మంది ఉత్తరాది వలస కార్మికులు హడావుడిగా పయనమవుతున్నారు. గత లాక్ డౌన్ ఇబ్బందులు వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పరిస్థితిని చూస్తుంటే… రాబోయే రెండు, మూడు రోజుల్లో నగరం నుంచి ఎంతో మంది వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.