రివాబా జడేజా ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తోందంటూ రవీంద్ర జడేజా సోదరి ఆరోపణ
- త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీ అభ్యర్థిగా రవీంద్ర జడేజా భార్య రివాబా
- జామ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ
- ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారకర్తగా జడేజా సోదరి
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. జడేజా భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, జడేజా సోదరి నైనబా కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా ఉన్నారు. అయితే రివాబా, నైనబా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
తాజాగా జడేజా సోదరి నైనబా స్పందిస్తూ, రివాబా ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం రివాబా చిన్నపిల్లలను వాడుకుంటోందని, ఇది బాలకార్మిక చట్ట వ్యతిరేకం అని నైనబా పేర్కొన్నారు.
అంతేకాదు, రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటును కలిగివున్న రివాబా… జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎలా పోటీచేస్తారని, ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
రికార్డుల ప్రకారం రివాబా అధికారిక పేరు రివా సింగ్ హర్దేవ్ సింగ్ సోలంకి అని, కానీ బ్రాకెట్లో రవీంద్ర జడేజా పేరును ఉంచడం ద్వారా జడేజా అనే ఇంటిపేరును ఉపయోగించుకుంటోందని నైనబా ఆరోపించారు. రివాబా తన సోదరుడ్ని పెళ్లి చేసుకుని ఆరేళ్లయిందని, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పేరును సవరించుకునే తీరిక దొరకలేదా అని విమర్శించారు.
జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా పోటీ చేస్తుండగా, జడేజా సోదరి నైనబా జామ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా ఉన్నారు. దాంతో, ఈసారి జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో పోటీ జడేజా ఇంటి పోరుగా మారింది.