బెంగాల్ స్కూల్‌కూ పాకిన హిజాబ్ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఎగ్జామ్స్ రద్దు!
- అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి వచ్చిన అబ్బాయిలు
- ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో స్కూలు ఫర్నిచర్ ధ్వంసం
- పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
నిన్నమొన్నటి వరకు కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను తాకింది. బెంగాల్‌లోని ఓ స్కూల్‌లో హిజాబ్, నామబలి (కాషాయ వస్త్రాలు) ధరించిన రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. హౌరాలోని ధూలగఢ్ స్కూలుకు హిజాబ్ ధరించి వచ్చిన వారిని అనుమతించడాన్ని నిరసిస్తూ కొందరు విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో విద్యార్థులు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పరిస్థితులు అదుపు తప్పడంతో సమాచారం అందుకున్న పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ వివాదం కారణంగా 11, 12వ తరగతుల పరీక్షలను స్కూలు యాజమాన్యం రద్దు చేసింది. ఆ తర్వాత సమావేశమైన స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ.. స్కూలు యూనిఫాంతో వస్తే తప్ప తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనపై బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హిజాబ్ ధరించి స్కూలుకు రావడాన్ని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా సమర్థించారు. సిక్కు వ్యక్తి హెల్మెట్‌కు బదులుగా తలపాగా ధరించడం రాజ్యాంగ ఉల్లంఘన కానప్పుడు ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడాన్ని ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. అలాగే, కాషాయ వస్త్రాలు ధరించి వస్తే కూడా వ్యతిరేకత ఉండకూడదన్నారు. కానీ, బీజేపీ మాత్రం దీనిని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు.