- మునుగోడు ఎన్నికల వాగ్దానాల అమలుదిశగా టీఆర్ యస్ అడుగులు!
-మంత్రులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్
-చండూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తాం… మునుగోడులో కేటీఆర్ ప్రకటన!
-మునుగోడు అభివృద్ధిపై సమీక్షించిన కేటీఆర్
-ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
-సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటన
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తాను నియోజకవర్గానికి వచ్చానని ఆయన తెలిపారు. సహచర మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రం చండూరు వచ్చిన కేటీఆర్.. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చండూరును త్వరలోనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మునుగోడులో త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. చండూరు మునిసిపాలిటీకి రూ.50 కోట్లు, చౌటుప్పల్ మునిసిపాలిటీకి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో కొత్తగా 5 సబ్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.