గుజరాత్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో మంటలు.. 12 మంది రోగుల సజీవ దహనం
- ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 50 మంది రోగులు
- క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రులకు తరలింపు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
గుజరాత్‌లోని భరూచ్ నగరంలో దారుణం జరిగింది. ఇక్కడి వెల్ఫేర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు సజీవ దహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరూచ్ ఎస్పీ తెలిపారు.
భరూచ్-జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ వెల్పేర్ ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.