ఫైటర్ షర్మిల పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?
-ఆమె అర్జునుడిగా తిరిగొస్తారా …?అభిమన్యుడిగా చిక్కుల్లో పడతారా ??
-ఆమె తాను ఎంచుకున్న మార్గంలో సక్సెస్ అవుతారా ??
-షర్మిల మాటల ప్రజలు నమ్ముతున్నారా ???
-ఆమె ఎవరో వదిలిన బాణం అని వస్తున్న విమర్శలకు సమాధానం దొరుకుతుందా ????
వైయస్ షర్మిల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు …తెలంగాణాలో సొంతపార్టీ పెట్టి 3500 కి .మీ పాదయాత్ర చేసిన నాయకురాలు …ఒక మహిళగా ఆమె చేసిన సాహసం నిజంగా మెచ్చుకోదగ్గదే .అయితే ఆమె ఎంచుకున్న మార్గం సరైనదేనా …?కదా ? తెలంగాణాలో ఆమెకు స్థానం ఉంటుందా ? ఇప్పటికే అనేక పార్టీలు ఉండగా ఆమెకు స్పేస్ ఉంటుందా ? అనే అభిప్రాయాలు సహజంగానే కలుగుతున్నాయి . అయితే ఎంచుకున్న మార్గం రైట్ పాత్ లేక రాంగ్ పాత్ అనే చర్చ జరుగుతుంది. ఆమె మొత్తానికి తెలంగాణ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు . ఇందులో నుంచి అర్జనుడిగా బయటకు వస్తారా ? లేక అభిమన్యుడుగా అందులోనే చిక్కుకుంటారా ? అనేది ఆసక్తిగానే ఉంది.
షర్మిల ఎన్నో ప్రతికూల రాజకీయపరిస్థితుల మధ్య దైర్యంగా పార్టీ పెట్టారు . ఒక ఆడ కూతురు కొత్తగా పార్టీ పెట్టి నెట్టుకొని రాగలరా ? అనే సందేహాలు కలిగాయి. అయితే ఆమె మొదటి పరీక్షలో డిస్టెన్స్ తెచ్చుకోకపోయిన పాస్ అయ్యారు . ఆమె పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారా? లేదా అనేది ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి తేలుతుంది.
ఇది ఎవరి మేలుకోసమో పెట్టిన పార్టీ అని ఆమెను ఎవరో నడిపిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. కొందరు కేసీఆర్ పెట్టించాడంటే ,మరికొందరు బీజేపీ ఆమెతో పార్టీ పెట్టించిందని మరికొందరు అంటున్నారు .ఇంతకీ ఈమె ఎవరి వదిలిన బాణం బీజేపీ వదిలిందా…? లేక కేసీఆర్ వదిలాడా…? అనే చర్చలు లేకపోలేదు . ఆమె ఎవరి వదిలిన బాణం అయినా కాకపోయినా మొదట్లో ఆమె పార్టీకి ఇక్కడ మనుగడ లేదన్నవారే ఆమె వైపు చూస్తున్నారు . ఆమె కదలికలను గమనిస్తున్నారు . ఆమె అడుగులు ఎటువైపు అనే నిశత పరిశీలన జరుగుతుంది. జీరో నుంచి ప్రారంభమైన ఆమె పార్టీ కొద్దోగొప్పో ప్రజల అభిమానాన్ని చూరగొనగలిగారు. అందుకే ఆమె పర్యటనలు ప్రజలు వస్తున్నారు . ఆమె చెప్పే మాటలు వింటున్నారు . అయితే ఆమె స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం అక్కడ సమస్యలు ప్రస్తావించడం ఇష్టంలేని పార్టీ ఎమ్మెల్యేలు ఆమె పై కారాలు , మిరియాలు నూరుతున్నారు . అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఆమె పర్యటనలకు ఆటంకాలు కల్పిస్తున్నారు . చివరకు దాడులు సైతం చేయిస్తున్నారు .
నాలుగురోజుల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆమె వాహనంపై రాళ్లదాడి చేయించడం కలకలం రేపింది. పోలీసులు దాడులు చేసిన టీఆర్ యస్ వాళ్ళను ఏమి అనకుండా ,దాడిలో గాయపడ్డ షర్మిల తో పాటు మిగతావారిని బలవంతంగా హైద్రాబాద్ తరలించడంపై విమర్శలు ఉన్నాయి. చివరకు హైద్రాబాద్ లో రాళ్లదాడిలో దెబ్బతిన్న కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవనం కు బయలుదేరిన షర్మిలను పోలీసులు మధ్యలో ఆపి బలవంతంగా క్రైన్ సహాయంతో ఆమెను కార్లోనే ఉంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు .దీన్ని బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు ఖండించారు .
మరుసటి రోజు ఆమె రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్నా పాలనా గురించి వివరించారు . తన పాదయాత్ర ఎక్కడ పోలీసులు అడ్డుకున్నారో అక్కడ నుంచే కొనసాగుతానని చెప్పారు . ఇప్పుడు షర్మిల పార్టీ వైపు ఆమె అడుగుల వైపు రాజకీయపార్టీలు ద్రుష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె ఒంటరిగానే పోటీ చేస్తారా ? లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా ?అనేది తేలాల్సి ఉంది. ఆమె ఇప్పటికే తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు . తమపార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన ఏపూరి సోమయ్య ను తుంగతుర్తి పోటీకి నిలుపుతున్నట్లు అక్కడ జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. కొందరు ఆమె కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తున్నట్లు ప్రచారం చేస్తుండగా, మరికొందరు బీజేపీ అని ,టీఆర్ యస్ తో అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్నికలనాటికి గానీ ఆమె వ్యూహాలు ,ఎత్తుగడలు ఏమిటి అనేది తేట తెల్లం అవుతుంది….