Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లేదు లేదు అంటూనే సింగరేణి ప్రవేటీకరణ …కేంద్రంపై నామ ధ్వజం !

సింగరేణి పై మాట తప్పిన మోదీ…ఎంపీ నామ నాగేశ్వరరావు!
-ఢిల్లీ మీడియా సమావేశంలో తెరాస లోక్ సభా పక్ష నేత
-లేదంటూనే సింగరేణి ప్రైవేటీకరణా ?
-సింగరేణి తెలంగాణాకు గుండెకాయ
-బొగ్గు బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తది..
-బొగ్గు బ్లాకులు వేలం నిలిపేయాలి
-ఉద్దేశపూర్వకంగానే సింగరేణి నిర్వీర్యం

సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రంపై మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఎంపీ నామ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని గతంలో చెప్పిన మాటకు భిన్నంగా నేడు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని కోరారు. భవిష్యత్లో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తున్నదని అన్నారు. కోల్ బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తుందని నామ ప్రశ్నించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించి, తెగనమ్మాలని చూడడం దారుణమన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని గతంలో సీఎం కేసీఆర్ ప్రధానికి పలుమార్లు లేఖలు రాశారని, ప్రధాని కూడా రామగుండం వచ్చిన సందర్భంలో సింగరేణిని (ప్రైవేటీకరించబోమని అప్పుడు చెప్పి, ఇప్పుడు దారుణంగా వంచించారని అన్నారు. ఈరోజు తాము పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు సింగరేణి నాలుగు బ్లాకులను (ప్రైవేటీకరిస్తున్నామని సమాధానం ఇచ్చారని, ఇది అన్యాయమన్నారు. దేశ వ్యాప్తంగా 38 బ్లాకులను అమ్ముతున్నట్లు కేంద్రం చెబుతుందని అన్నారు. తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అన్నారు. ఒక వైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ మరో వైపు మైన్స్ కూడా లేకుండా అమ్మకానికి పెట్టారని దుయ్యబట్టారు. సింగరేణి ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెట్టిందన్నారు. సింగరేణిని తెలంగాణాకే వదిలేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణానే తీసుకుంటుందని నామ అన్నారు. సీఎం చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా సింగరేణి బ్లాకులను ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదన్నారు. వేలాది మందికి జీవోనోపాధి కల్పిస్తున్న సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వెనుక అనుమానాలున్నాయని అన్నారు. సింగరేణి నుంచి దాదాపు రెండు వేలకు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతున్నదని, వేలాది మంది కార్మికులు సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని, తెలంగాణ సమాజమంతా ఐక్యంగా కేంద్రం వైఖరిని ఎండగడుతుందని అన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తెలంగాణ సమాజం నహించదన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికి తెలియజేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని ప్రోత్సహించకపోగా అంతులేని వివక్షత చూపిస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోందని నామ పేర్కొన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, నిధుల నిలిపివేత, విభజన హామిల అమలులో వైఫల్యం, దివాలాకోరు రాజకీయాలు తదితర అంశాలపై పార్లమెంట్లో గర్జిస్తామని నామ స్పష్టం చేశారు.

Related posts

ఇంతకీ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్నట్టా ? లేనట్టా ?

Drukpadam

చస్తే కూడా శ్మశానంలో చోటు దొర‌క‌ట్లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ‌?: రేవంత్ రెడ్డి

Drukpadam

ఐరాసలో ఆఫ్ఘనిస్థాన్ రాయబారిగా సుషైల్ షహీన్.. ప్రతిపాదించిన ఆ దేశ విదేశాంగ మంత్రి!

Drukpadam

Leave a Comment