ఇక రోజుకు 90 వేల మందికే అయ్యప్ప దర్శనం!
- ఇటీవల అయ్యప్ప సన్నిధికి పోటెత్తుతున్న భక్తులు
- కొన్నిరోజులుగా నిత్యం లక్ష మందికి పైగా దర్శనం
- భక్తుల రద్దీ నియంత్రించలేకపోతున్న అధికారులు
- పరిస్థితిని సమీక్షించిన సీఎం పినరయి విజయన్
గత కొన్నిరోజులుగా శబరిమలకు అయ్యప్ప మాలధారులు పోటెత్తుతున్నారు. ఇటీవల నిత్యం లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. దాంతో భక్తులను నియంత్రించడం సిబ్బందికి, అధికారులకు కష్టమవుతోంది.
భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 90 వేల మందికే దర్శనం కల్పించాలని తీర్మానించింది. భక్తుల తాకిడి పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్, ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు వర్గాలు, ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులను సమీక్షించారు.
స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యపై పరిమితి విధించడమే కాకుండా, దర్శన వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. వాహనాలకు పార్కింగ్ సదుపాయాలను పెంచాలని కూడా సీఎం విజయన్ అధికారులను ఆదేశించారు.