శ్రీశైలం వద్ద రోప్ వే… ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం!
- పర్వతమాల పథకం ప్రకటించిన కేంద్రం
- ఏపీ పర్యాటకానికి కొత్త రూపు
- శ్రీశైలం వద్ద రోప్ వే ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
- మార్చిలో టెండర్లు పిలిచే అవకాశం
ఏపీ పర్యాటకానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్వతమాల పథకంలో భాగంగా శ్రీశైలం-ఈగలపెంట మధ్య రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శ్రీశైలం వద్ద రోప్ వే ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం కూడా పచ్చజెండా ఊపింది. ప్రీ ఫీజబులిటీ అధ్యయనం కూడా పూర్తయింది. వచ్చే మార్చి నుంచి శ్రీశైలం-ఈగలపెంట మధ్య రోప్ వే ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవనుంది.
కాగా, రాష్ట్రంలో మరో మూడు పర్యాటక ప్రాంతాల్లోనూ రోప్ వే ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి-భవానీ ద్వీపం, లంబసింగి, గండికోట టూరిస్టు ప్రదేశాల్లో రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ప్రీ ఫీజబులిటీ అధ్యయనం కొనసాగుతోంది. ఈ అధ్యయనం మార్చి లోపు పూర్తవుతుందని భావిస్తున్నారు.
వీటికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏప్రిల్ లేదా మే నెలలో టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్కో రోప్ వే ప్రాజెక్టుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
అటు, విశాఖ బీచ్ రోడ్ లో కేబుల్ కార్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. విశాఖలోని వివిధ బీచ్ లను కలుపుతూ దాదాపు 8 కిలోమీటర్ల మేర కేబుల్ కార్ వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.