అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన.. పెళ్లి కాని ప్రసాదుల వినూత్న నిరసన!
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటన
గుర్రాలపై పెళ్లికొడుకుల్లా వచ్చిన యువకులు
సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
రాష్ట్రంలో లింగనిష్పత్తి దారుణంగా పడిపోయిందని ఆరోపణ
పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, అమ్మాయిల కోసం తిరిగి తిరిగి వేసారిపోయిన యువకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన. వివాహం చేసుకుందామంటే రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ‘పెళ్లి కాని ప్రసాదు’లందరూ గుర్రాలపై వచ్చి నిరసన చేపట్టారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువకులు పెళ్లికొడుకుల్లా అలంకరించుకుని పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా క్రాంతి జ్యోతి పరిషత్ చైర్మన్ రమేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళలు లేరని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ తమకు పెళ్లిళ్లు కావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు.