Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

18 న ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభం…

 

ముస్తాబైన ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్

18న ప్రారంభించనున్న సీఎం కేసిఆర్, మంత్రి పువ్వాడ అజయ్

రూ.53.20 కోట్లతో పూర్తిచేసిన తెలంగాణ సర్కార్‌

అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం ‘సమీకృత కలెక్టరేట్‌’ ప్రారంభానికి ముస్తాబైంది. ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభంకానుంది. వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద 20.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2017లోనే పనులు ప్రారంభమైనప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రత్యేక చొరవతో వాటన్నింటినీ అధిగమించి పనుల్లో వేగం పెంచారు. భవన సముదాయాన్ని జీ ప్లస్‌-2 విధానంలో నిర్మించారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 20 వరకు కార్యాలయాల చొప్పున మొత్తం 56 ప్రభుత్వ శాఖలకు గదులను ఏర్పాటు చేశారు.

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నూతన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నది. అన్ని జిల్లాల్లోనూ ఒకే డిజైన్‌, ప్రభుత్వశాఖల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సముదాయాలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మంలో వైరాప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద నయా కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టింది. పనులు ప్రారంభమైనప్పటి నుంచి సమీకృత భవన సముదాయం వేగవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పలుమార్లు నూతన కలెక్టరేట్‌ భవనం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు పూర్తికావడం కోసం ప్రతి వారం మంత్రి పువ్వాడ పర్యవేక్షించారు.

మూడు అంతస్తులు.. నాలుగు బ్లాకులు

ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ఆకర్షణీయంగా, అద్భుతంగా తయారైంది. దీన్ని జీప్లస్‌-2 విధానంలో నిర్మించారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు బ్లాకులుగా విభజన చేశారు. ఒక్కో బ్లాకులో 20 వరకు కార్యాలయాల చొప్పున మొత్తం 56 ప్రభుత్వ శాఖలకు గదులను నిర్మించారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం కోసం 2017 మే 1న ప్రభుత్వం రూ.35.38 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. అయితే, కలెక్టర్‌ భవన నిర్మాణ వ్యయం పెరగడంతో 2020 సెప్టెంబర్‌లో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణ వ్యయాన్ని రూ.53.20కోట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్‌ మొత్తం విస్తీర్ణం 1,59,307చదరపు గజాలు ఉంది.

ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌ 53.900 చదరపు గజాలు మొదటి అంతస్తు 50.874చదరపు గజాలు, రెండో అంతస్తు 54.493 చదరపు గజాల్లో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కలెక్టర్‌ చాంబర్‌, అదనపు కలెక్టర్‌ చాంబర్‌లతోపాటు డీఆర్‌వో కార్యాలయాలు నిర్మించారు. 250 మందితో సమావేశం నిర్వహించేలా సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, కలెక్టరేట్‌ సిబ్బంది గదులు నిర్మించారు. మొదటి అంతస్తులో మంత్రులు, ఉన్నతాధికారులు, స్టేట్‌ చాంబర్‌, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, వివిధశాఖలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు పలు శాఖల కార్యాలయాలను నిర్మించారు.

Related posts

యుద్ధ విమానం కూలిపోతే ఇంట కథ ఉందా?

Drukpadam

అమెరికాలో మళ్లీ కాల్పులు..నలుగురి మృతి…

Drukpadam

ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు…

Ram Narayana

Leave a Comment