బీఆర్ యస్ ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో మైలు రాయిగా నిలుస్తుంది …మంత్రి హరీష్ రావు…
-తెలంగాణ పధకాలు వివిధరాష్ట్రాల్లో అమలు చేయాలనీ డిమాండ్ పెరుగుతుంది
-కేసీఆర్ నాయకత్వాన్నిదేశం కోరుకుంటుంది
-కేసీఆర్ తోపాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,జాతీయనేతలు ఖమ్మం సభకు హాజరవుతారు
-18 వ తేదీ ఉదయం ప్రగతి భవనంలో సీఎం ల నేతలతో కేసీఆర్ సమావేశం
-అనంతరం రెండు హెలీకాఫ్టర్స్ ద్వారా యాదాద్రి దర్శనం
తర్వాత ఖమ్మం వస్తారు …
ఈ నెల 18న ఖమ్మం లో నిర్వహించనున్న బీఆర్ యస్ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మైలు రాయిగా నిలుస్తుందని, రాజకీయాలను మలుపు తిప్పుతుందని రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరిశ్ రావు అన్నారు .ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ యస్ రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు .
కేంద్రంలో బీజేపీ,విచ్చిన్నకర , ఏర్పాటువాద దొరణలతో పాలనగాడి తప్పిందని అప్రజాస్వామిక విధానాలవల్ల దేశం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు . బీజేపీకి ప్రత్యాన్మాయ శక్తిగా బీఆర్ యస్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు . దేశంలో తెలంగాణ పాలన రోల్ మోడల్ గా మారిందని అందువల్ల వివిధ రాష్ట్రాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు . ప్రజలు తెలంగాణ లాగానే తమ రాష్ట్రాల్లో కూడా రైతు బందు అమలు చేయాలనీ కోతలు లేని కరంటు ఇవ్వాలని కోరుతున్న విషయాన్నీ గుర్తుచేశారు . మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ కావాలని అంటున్నారని తెలిపారు . పక్కన ఉన్న కర్ణాటక , మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఇది మన రాష్ట్ర ప్రజా రంజక పాలనకు నిదర్శనమని అన్నారు .
దేశరాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ సభకు కేసీఆర్ తోపాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ , సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా , సిపిఎం ,సిపిఐ రాష్ట్రకార్యదర్శులు తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు హాజరు కానున్నట్లు తెలిపారు . సీనియర్ సిపిఐ నాయకులూ పువ్వాడ నాగేశ్వరరావు సైతం వేదికపై కూర్చుంటారని పేర్కొన్నారు . జిల్లాకు చెందిన మంత్రి , ఎంపీలు , ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు ,ఇతర ప్రముఖులు అందరు వేదికపై ఉంటారని అన్నారు .
ఈ సభకు ఖమ్మం జిల్లాతోపాటు, 100 కి.మీ పరిధిలో ఉన్న డోర్నకల్ ,మహబూబాబాద్ ,పాలకుర్తి , సూర్యాపేట ,కోదాడ ,హుజూర్ నగర్ నియోజకవర్గాలనుంచి కూడా ప్రజలు తరలి రానున్నారని హరీష్ రావు వివరించారు . జన సమీకరణ కోసం నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించినట్లు వారు ఇప్పటికే నియోజవర్గాల్లో తిరిగి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్లాన్ చేస్తున్నారని అన్నారు .
సభకు భారీ ఏర్పాట్లు
18 న జరగనున్న భారీ బహిరంగసభను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని , 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు .వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారు.
సభకు వాహనాలు దొరకడం లేదు..
సభకు ఐదు లక్షలమంది పైగా ప్రజలు హాజరు కానున్నారని , ఒక్క ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నామని సూర్యాపేట ,మహబూబాబాద్ జిల్లాలనుంచి పాలకుర్తి నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారని అన్నారు .సభకు వచ్చేందుకు ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని కానీ వాహనాలు దొరకటంలేదని అన్నారు .పక్క రాష్ట్రాల నుంచి వాహనాలు తెప్పిస్తున్నామని తెలిపారు .
17 న రాత్రికే జాతీయ నేతలు సీఎం లు హైద్రాబాద్ రాక…
రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు 17 న రాత్రికే హైదరాబాద్ చేరుకుంటారన్నారు . 18 న ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారు.యాదాద్రి దర్శనం చేసుకొని..రెండు హెలి కాప్టర్ల లో ఖమ్మం చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు .
కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుంది.. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, పల్లా రాజేశ్వర రెడ్డి , తాతా మధు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు .