టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు..
-కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదన్న సోము వీర్రాజు
-జనసేనతో పొత్తు ఉంటుందని వ్యాఖ్య
-ఇటీవలి కాలంలో టీడీపీకి దగ్గరవుతున్న పవన్
రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీని ఇచ్చారు. టీడీపీ, వైసీపీలతో కలిసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదని చెప్పారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో టీడీపీతో జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరవుతున్న తరుణంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేనలు ఇప్పటికీ పొత్తులోనే ఉన్నాయి. కానీ, రెండు పార్టీలూ ఇప్పటి వరకు ఎప్పుడూ కలిసి పని చేసిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో సైతం జనసేన అంశం ప్రస్తావనకు రాలేదు. దీంతో, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా టీడీపీ తోసహా అన్ని పార్టీలను ఏకం చేయాలనే ప్రయత్నాలకు గండిపడినట్లు అయింది. అయితే జనసేన బీజేపీతో బంధం తెంచుకొని టీడీపీతో కలిసి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల భావన . బీజేపీతో ఉన్న కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉండే అవకాశం లేదు . అందువల్ల బీజేపీతో ఉంటె లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీ నేత చంద్రబాబుతో పలుమార్లు మంతనాలు జరుపుతున్నారు . ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని ఆలోచనలు చేస్తున్నారు .ఇందుకోసమే అటు చంద్రబాబు కుమారుడు లోకేష్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు పాదయాత్రలు , వాహన యాత్రలతో ప్రజలను కలుస్తున్నారు . టీడీపీ నేత చంద్రబాబు సీఎంగా అయ్యేందుకు జనసేన కార్యకర్తలు అంగీకరించే అవకాశాలు లేవు .అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ను నీవే సీఎం అని భరోసా ఇచ్చే అవకాశం టీడీపీ నుంచి లేదు . ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితో పొత్తులు ఎవరికీ ఉంటాయనేది చెప్పలేని స్థితి ఏర్పడింది .