పులిలా గాండ్రించి.. పిల్లిలా ప్రసంగించారు.. తెలంగాణ గవర్నర్ పై జగ్గారెడ్డి విమర్శలు
- గవర్నర్ బయట చాలా మాట్లాడారని, ప్రసంగంలో మాత్రం తుస్ అనిపించారని జగ్గారెడ్డి విమర్శ
- మొన్నటి దాకా తమిళిసై, కేసీఆర్ కు మధ్య యుద్ధాలే జరిగాయని వ్యాఖ్య
- తప్పనిసరి పరిస్థితిలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళి సైపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గవర్నర్ బయట చాలా నరికారు.. పులి తీరుగా గాండ్రించారు. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారు’’ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ అంశంపై జగ్గారెడ్డి స్పందించారు.
ప్రభుత్వం చేసే పనులను గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సాధారణమేనని జగ్గారెడ్డి చెప్పారు. అయితే గవర్నర్ బయట పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ప్రసంగంలో మాత్రం తుస్ అనిపించారని విమర్శించారు.
మొన్నటి దాకా తమిళిసై, కేసీఆర్ కు మధ్య యుద్ధాలే జరిగాయన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకటే దారిలో నడిచారని, ఒకరికొకరు దండాలు పెట్టుకున్నారని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి నడవమన్న డైరెక్షన్ లో గవర్నర్ నడిచారని దుయ్యబట్టారు. తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్, గవర్నర్ మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు.