జగన్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందా?
-ఫోన్ల ట్యాపింగ్ వ్యహారంలో కలకలం
-నా ఫోన్ కూడా ట్యాపింగ్‌లో ఉందనుకుంటా పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు
-ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
-అలాంటి అనుమానాన్నే వ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ
-ప్రస్తుత పరిస్థితులను బట్టి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య
జగన్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందా …? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మొత్తుకుంటున్నారు . అయితే అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని అధికార పక్షం చెపుతుంది.అయినప్పటికీ దీనిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ఫోన్లపై ప్రభుత్వం నిఘా ఉంచిందని, ట్యాప్ చేస్తోందంటూ ఇప్పటికే పలువురు నేతలు ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి కాక రేపారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని, దీంతో 12 సిమ్‌కార్డులు మార్చాల్సి వచ్చిందని చెప్పారు.
తాజాగా, ఈ జాబితాలోకి శాసనసభ మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చేరారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తన ఫోన్ కూడా ట్యాపింగ్‌లో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఒంగోలులో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న కోటంరెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ ఆయనిలా వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా నిఘాలోనే ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందని ఎమ్మెల్సీ విఠపు అనుమానం వ్యక్తం చేశారు.
ఆనం రాంనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు . నిజంగా జరుగుతుందా ? లేదా ?అనే విషయం దర్యాప్తు జరిపితేగాని తేలుతుంది.అయితే ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే కేంద్ర హోమ్ శాఖ అనుమతి తప్పనిసరి . అదికూడా దేశద్రోహానికి ఆవ్యక్తి పాల్పడుతున్నాడని అనుకుంటే అప్పుడు కేంద్ర హోమ్ శాఖ పర్మిషన్ ఇస్తుంది . అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలు తమ పార్టీలో ఉన్న అసమ్మతినేతలపై ఎలాంటి అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధం . స్వపక్షంలో ఉంటూ వేరే పక్షాలకు సమాచారం అందించడం,వారికే ఉపయోగపడటం , అనేదానిపై చట్టంలో ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి ….