Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అక్బరుద్దీన్ ఒవైసీని కలవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ!

అక్బరుద్దీన్ ఒవైసీని కలవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ!

  • అసెంబ్లీలో బీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తిన అక్బరుద్దీన్
  • నేడు అక్బర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటామంతీ
  • తాజా పరిణామాలపై చర్చించామన్న భట్టి
  • తామిద్దరం పాత మిత్రులం అన్న జగ్గారెడ్డి
  • ఎంఐఎం 50 స్థానాల్లో పోటీచేసే అంశంపై మాట్లాడానన్న శ్రీధర్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. ఈ నేపథ్యంలో, అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అసెంబ్లీలో అక్బరుద్దీన్ ది తన పక్క సీటేనని వెల్లడించారు. ఎప్పుడూ మాట్లాడినట్టుగానే మాట్లాడానని, అందులో కొత్తేమీ లేదని అన్నారు. పిచ్చాపాటీగా ముచ్చటించుకున్నామని తెలిపారు. తమ సంభాషణను రాజకీయ ప్రాధాన్యతా కోణంలో చూడాల్సిన అవసరం లేదని భట్టి స్పష్టం చేశారు. తోటి ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడానని అన్నారు. 

మరో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిస్తూ… అక్బరుద్దీన్ ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దాం అనే అంశంపై చర్చించలేదని వెల్లడించారు. అక్బరుద్దీన్ సభలో ప్రకటించిన మేరకు ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసే అంశంపై మాట్లాడినట్టు శ్రీధర్ బాబు వివరించారు. తాజా పరిణామాలపై మాత్రమే చర్చించుకున్నామని తెలిపారు. 

అక్బరుద్దీన్ ను కలిసిన వారిలో జగ్గారెడ్డి కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ… తామిద్దరం పాత మిత్రులం అని, ఇద్దరి లక్ష్యాలు ఒక్కటేనని వెల్లడించారు. తమవి లౌకికవాద భావాలున్న పార్టీలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కలిసి పనిచేస్తామా? లేదా? అన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించామని, తమ మధ్య గాంధీ కుటుంబం గురించి కూడా ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఇంకొన్ని విషయాలు కూడా చర్చకు వచ్చాయని, అవి చెప్పలేనని జగ్గారెడ్డి అన్నారు.

Related posts

గాడ్సే జిందాబాద్ అంటూ ట్విట్లు చేయడంపై వరుణ్ గాంధీ ఫైర్ !

Drukpadam

కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్.. ఒక్కరోజు ఖర్చెంతంటే!

Drukpadam

పార్టీని గాడిలో పెట్టేందుకు సోనియా కఠిన నిర్ణయం!

Drukpadam

Leave a Comment