తమిళనాడు సీఎం స్టాలిన్ పూర్వికులది ప్రకాశం జిల్లా చేరుకొమ్ముపాలెం!
స్టాలిన్ సీఎం కావడంతో ప్రకాశం జిల్లాలోని చెరువుకొమ్ము పాలెం లో సంబరాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం
సీఎం పీఠం అధిష్ఠించిన స్టాలిన్
ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో ఉత్సాహభరిత వాతావరణం
ఇక్కడ్నించే తమిళనాడు వలస వెళ్లిన కరుణానిధి పూర్వీకులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘనవిజయం సాధించడం, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ సీఎం పీఠం అధిష్ఠించడం తెలిసిందే. అయితే, స్టాలిన్ సీఎం కావడంతో ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందుకు బలమైన కారణమే ఉంది. ఆ ఊరి పేరు చెరువుకొమ్ముపాలెం. ఈ గ్రామంతో స్టాలిన్ పూర్వీకులకు సంబంధం ఉంది.
స్టాలిన్ తండ్రి కరుణానిధి పూర్వీకులు విజయనగరం జిల్లాకు చెందినవారైనా, ఉపాధి కోసం ప్రకాశం జిల్లాకు తరలివచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో పెళ్లూరు సంస్థానాన్ని పరిపాలించిన వెంకటగిరి రాజా సంస్థానంలో సంగీత విద్యాంసులుగా పేరుగడించారు. ఈ క్రమంలో వారికి వెంకటగిరి రాజావారు చెరువుకొమ్ముపాలెంలో నివాస స్థలాలు కేటాయించారు. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు. వీరికి రాజావారు 200 ఎకరాల భూమిని మాన్యం కింద కేటాయించారు.
అయితే, కొన్నాళ్ల తర్వాత ప్రకాశం జిల్లాలో తీవ్ర కరవుకాటకాలు సంభవించడంతో వారు తమకిచ్చిన భూములను అమ్మేశారు. కరుణానిధి తండ్రి, తాతలు ఆ తర్వాత కాలంలో తమిళనాడులోని తంజావూరు వలస వెళ్లారు. ఇప్పటికీ చెరువుకొమ్ముపాలెంలో కరుణానిధి ముత్తాతలు నివసించిన ఇళ్ల తాలూకు శిథిలాలను చూడొచ్చు.
కాగా, సినీ రంగంలో సుప్రసిద్ధ రచయితగా విశేష ఖ్యాతి పొందిన కరుణానిధి గొప్ప నాదస్వర విద్వాంసుడు కూడా. తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించి సీఎం కావడం తమిళ రాజకీయాల్లో ఓ అధ్యాయం. కరుణానిధి తమ పూర్వీకుల గురించి ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1960లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్ నవలా రచయితల సమావేశానికి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లానే అని, చెరువుకొమ్ముపాలెం తమ గ్రామం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లామని నాడు కరుణానిధి చెప్పారు.