Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జడ్జిలుగా మారిన రాజకీయ నేతలు.. నేతలుగా మారిన జడ్జిలు.. ఎవరంటే..!

జడ్జిలుగా మారిన రాజకీయ నేతలు.. నేతలుగా మారిన జడ్జిలు.. ఎవరంటే..!

  • మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్‌ గౌరి నియామకంపై వివాదం
  • ఓ పార్టీలో నేతగా ఉన్న వ్యక్తిని జడ్జిగా నియమించడంపై వ్యతిరేకత
  • గతంలో జడ్జిలుగా, సీజేలుగా పని చేసిన రాజకీయ నేతలు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జడ్జిలు

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరిని నియమించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గతంలో ఆమె బీజేపీలో ఉండటమే ఇందుకు కారణం. ఓ పార్టీలో నేతగా ఉన్న వ్యక్తిని జడ్జిగా నియమించడంపై వ్యతిరేకత వస్తోంది. అయితే ఇలా జరగడం మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. సీజేఐలుగా పని చేసిన వాళ్లు కూడా ఎంపీలుగా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు హైకోర్టు జడ్జిలుగా బాధ్యతలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి.

‘‘రాజకీయాలు లేని చట్టం గుడ్డిది.. చట్టం లేని రాజకీయాలు చెవిటివి’’ అని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ అప్పట్లో చెప్పారు. ఈయన రాజకీయవేత్తగా మారిన న్యాయమూర్తి.. తర్వాత న్యాయమూర్తిగా మారిన రాజకీయ నాయకుడు. సీపీఐ సభ్యునిగా మద్రాస్, కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1965 వరకు క్రియాశీల రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 1968లో హైకోర్టు జడ్జి అయ్యారు. తర్వాత రాజకీయ మద్దతుతో ఐదేళ్లకే సుప్రీంకోర్టు జడ్జిగానూ పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

జస్టిస్ బహరుల్ ఇస్లాం కూడా ఇలానే. 1962, 1968లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1972లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గౌహతి హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. మార్చి 1980లో రిటైర్ అయ్యాక.. మళ్లీ పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ 9 నెలల తర్వాత ఆయన్ను సుప్రీంకోర్టు జడ్జిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. 1983లో కాంగ్రెస్ బీహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి మళ్లీ రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

కేఎస్ హెగ్డే కాంగ్రెస్ నుంచి 1952, 1954లో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957లో ఎంపీ పదవికి రాజీనామా చేసి మైసూరు హైకోర్టు జడ్జి అయ్యారు. తర్వాత 1967లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఆయనను, మరో ఇద్దరు సీనియర్ జడ్జీలను కాదని జస్టిస్ ఏఎన్ రాయ్ ను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో 1973లో ఆ ముగ్గురూ రాజీనామా చేశారు. ఆ తర్వాత 1977లో హెగ్డే జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. నాడు లోక్ సభ స్పీకర్ గానూ ఎన్నికయ్యారు. 

జస్టిస్ అఫ్తాబ్ అలం.. కాంగ్రెస్ లో ఉండేవారు. హైకోర్టు జడ్జిగా నియమితులయ్యాక పార్టీకి రాజీనామా చేశారు. 

జస్టిస్ ఎఫ్ఐ రెబెల్లో.. 1996లో జనతా పార్టీ నుంచి గోవా ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ సమయంలోనే బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2010-11లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 

జమ్మూకశ్మీర్ హైకోర్టు జడ్జి హస్తయిన్ మసూది.. తన పదవీ విరమణ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా అనంత్ నాగ్ లోక్ సభ సీటు నుంచి పోటీచేశారు. జస్టిస్ ఏఎం తిప్సే, జస్టిస్ విజయ్ బహుగుణ, జస్టిస్ ఎం.రామ జోయిస్, జస్టిస్ రాజేందర్ సచర్ తదితరులు హైకోర్టు జడ్జిలుగా రిటైర్ అయ్యాక.. రాజకీయాల్లోకి వచ్చారు. సుప్రీంకోర్టు సీజేఐలుగా పదవీ విరమణ పొందిన తర్వాత జస్టిస్ రంగనాథ్ మిశ్రా, రంజన్ గొగొయ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Related posts

పెగాసెస్‌పై చ‌ర్చించ‌డానికి వీల్లేదు: టీడీపీ ఎమ్మెల్యేలు!

Drukpadam

అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

Drukpadam

హైదరాబాద్‌కు అఖిలేశ్ యాదవ్, సీఎం కేసీఆర్‌తో భేటీ…!

Drukpadam

Leave a Comment