గుజరాత్ లో పదుల సంఖ్యలో సింహాలు రహదారిపై సంచారం..
- అర్ధరాత్రి వేళ వీధిలోకి ప్రవేశించిన సింహాలు
- ఎదురుగా వాహనాలు రావడంతో వెనుదిరిగిన వైనం
- వీడియోని షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
అర్ధరాత్రి సమయం. అందరూ నిద్రించిన వేళ. అదొక వీధి. సింహాలు ఒకదాని వెంట ఒకటి స్వేచ్ఛగా వెళుతున్నాయి. కొన్ని సింహాలు పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి అటూ, ఇటూ చూస్తున్నాయి. ఆ సమయంలో పొరపాటుగా ఎవరైనా ఒంటరిగా వాటి కంట్లో పడివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి..? దాడి చేసి చంపేయవూ..!
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి శుశాంత నందా ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ‘మరో రోజు. మరోసారి గర్వకారణం. గుజరాత్ వీధుల్లో నడుస్తున్న తీరు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. గుజరాత్ లో ఏ ప్రాంతమో ఆయన తెలియజేయలేదు. కాకపోతే అదొక చిన్నపాటి వీధి అని వీడియో పరిశీలిస్తే తెలుస్తుంది. అక్కడ ఇళ్లు కూడా కనిపిస్తున్నాయి.
సింహాలకు ఎదురుగా కొన్ని వాహనాలు రావడంతో.. అవి వాహన లైట్లకు భయంతో వెనుదిరగడాన్ని వీడియోలో గమనించొచ్చు. ‘‘ఓరి దేవుడా!! ఎవరైనా బయటకు వస్తే పరిస్థితి ఏంటి? భయంకరం’’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియో చూసి కామెంట్ చేశాడు. ఇది చాలా విచారకరమని మరో యూజర్ పేర్కొన్నాడు. క్రూర మృగాలు అడవుల్లో సంచరించాలే గానీ, ఇలా ప్రజల నివాసాల మధ్యలోకి వస్తే నిజంగా ప్రమాదకరమే.