అదానీ కేసులో మీడియాను కట్టడి చేయడానికి నో చెప్పిన సుప్రీంకోర్టు!
- మీడియా సంచలనం కోసం ప్రయత్నిస్తోందన్న న్యాయవాది శర్మ
- మీడియా వార్తలవల్ల షేర్ల ధరలు పడిపోయి, ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వాదన
- తాము మీడియాను నిషేధించబోమన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో.. దీనిపై మీడియా వార్తలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా అడ్డుకోవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తన ఆదేశాలు జారీ చేసేంత వరకు మీడియాను నిరోధించాలని ఎంఎల్ శర్మ కోరారు.
‘‘మేము మీడియాను నిషేధించం. మా ఆదేశాలు వెంటనే జారీ చేస్తాం’’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. అదానీ-హిండెన్ బర్గ్ అంశంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు కాగా, వీటిపై సుప్రీంకోర్టు తన ఆదేశాలను ఫిబ్రవరి 17న రిజర్వ్ చేసింది. వీటిని ప్రకటించాల్సి ఉంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్, దాని నిర్వాహకుడు నాథన్ అండర్సన్, భారత్ లోని అతి అసోసియేట్లపై విచారణ నిర్వహించేలా, ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా కేంద్ర హోంశాఖ, సెబీలకు ఆదేశాలు జారీ చేయాలని ఎంఎల్ శర్మ తన పిల్ లో కోరారు. అదానీ సహా ఇతర కంపెనీలకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు, సెబీ ధ్రువీకరణ లేకుండా వాటిని మీడియా ప్రచురించకుండా అడ్డుకోవాలని శర్మ కోరారు. అన్ని ఆరోపణలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, సంచలనం కోసం పాకులాడడం వల్ల షేర్ల ధరలు పడిపోయి, ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని శర్మ వాదనగా ఉంది.