కేంద్ర మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి.. బెంగాల్ లో ఘటన
- కూచ్ బెహర్ లో స్థానిక బీజేపీ ఆఫీసుకు వెళ్తుండగా దాడి
- గుంపుపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- తృణముల్ కార్యకర్తలే రాళ్లు రువ్వారన్న కేంద్ర మంత్రి
కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై ఆయన సొంత నియోజకవర్గంలోనే దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో దుండగులు రాళ్లు రువ్వారు. స్థానిక బీజేపీ ఆఫీసుకు ఆయన వెళ్తుండగా ఈ దాడి చేశారు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపైకి కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర్తలు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడం వీడియోల్లో కనిపించింది.
ఈ దాడిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేశారని నిశిత్ ప్రమాణిక్ ఆరోపించారు. ‘‘ఒక మంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. బెంగాల్ లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో.. ఈ ఘటన ద్వారా తెలిసిపోయింది’’ అని ఆయన విమర్శించారు.
కూచ్ బెహర్ నుంచి ఎంపీగా ప్రమాణిక్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుంది. ఇటీవల బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో గిరిజనుడు చనిపోవడంపై కేంద్ర మంత్రి ప్రమాణిక్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని స్థానిక రిపోర్టులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలిపాయి.