మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. నిమ్స్ వద్ద అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత…
- ప్రీతికి ఐదు రోజులుగా నిమ్స్‌లో చికిత్స
- మృతికి గల కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకెళ్తానన్న తండ్రి
- మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లే యత్నం
- అడ్డుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు
- తోపులాటలో బద్దలైన ఐసీయూ గ్లాస్ డోర్
- సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రులు
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూశారు. సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతికి హైదరాబాద్ నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత రాత్రి 9.10 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించారు. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ గత రాత్రి పేర్కొన్నారు.
ఉద్రిక్తత
ప్రీతి మృతితో నిమ్స్ వద్ద అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన కుమార్తె మరణానికి గల కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకెళ్తానని, లేదంటే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ప్రీతి తండ్రి నరేందర్ హెచ్చరించారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్ చేసిన తర్వాతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు, మృతదేహాన్ని అంబులెన్సులో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ఈ సందర్భంగా ఏఆర్‌సీ వార్డు ముందు జరిగిన తోపులాటలో ఐసీయూ గ్లాస్ డోర్ బద్దలైంది. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్ చేసి పంపుతామని ఓ వైద్యుడు చేసిన వ్యాఖ్యలపై బంధువులు, కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కాగా, ప్రీతి మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఉదయానికల్లా స్వస్థలం పంపేలా ఏర్పాటు చేశారు.
కేసీఆర్, మంత్రుల సంతాపం.. రూ. 10 లక్షల పరిహారం
ప్రీతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేసినట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని అన్నారు. ప్రీతి మృతికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డి, మహమూద్ అలీ తదితరులు సంతాపం తెలిపారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు అధ్యక్షురాలు షర్మిల సంతాపం తెలిపారు.