28 కి .మీ ప్రయాణానికి సీఎం జగన్ హెకాఫ్టర్ ఉపయోగించడంపై జనసేన నేత నాదెండ్ల విమర్శలు …
తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో జగన్ ప్రయాణం
ఆ మాత్రం దూరం కూడా రోడ్డు మార్గంలో వెళ్లలేరా అంటూ ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్
ప్రజలను గతుకు రోడ్ల పాల్జేసి జగన్ మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నరని విమర్శ
గుంతలు పడ్డ రోడ్లపై అవస్థ పడుతూ తిరుగుతున్న జనాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో తిరుగుతున్నారని జనసేన నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ నుంచి తెనాలి కేవలం 28 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని చెప్పారు. ఈ మాత్రం దూరం కూడా సీఎం జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నారని అన్నారు. దీనికోసం హెలికాప్టర్ ఉపయోగించడమంటే కచ్చితంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ఇలా ముఖ్యమంత్రి హెలికాప్టర్ల టూర్లకు ఖర్చుపెట్టడమేంటని నాదెండ్ల నిలదీశారు.
హెలికాప్టర్ కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగుచేయించవచ్చని తెలిపారు. ప్రజలను గతుకుల రోడ్ల పాల్జేసిన జగన్.. తను మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం జగన్ తెనాలి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమేంటని నాదెండ్ల పోలీసులను నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలన్నా సీఎం జగన్ కు భయమని చెప్పారు. అందుకే ప్రతిపక్షాలకు చెందిన నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటన సందర్భంగా తెనాలిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని నాదెండ్ల మనోహర్ పోలీసులపై విమర్శలు గుప్పించారు.