మూడో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్…
- 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
- డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించిన ఆసీస్
- ఈ నెల 7 నుంచి అహ్మదాబాద్ లో చివరి టెస్టు
వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. మూడో టెస్టు కూడా గెలిచి సిరీస్ తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధించాలని ఆశించిన రోహిత్ సేనకు ఇండోర్ లో చుక్కెదురైంది. స్పిన్ అస్త్రంతో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ను చుట్టేసిన భారత్ ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకొని 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని మూడో రోజు, శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేసి భారత ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రెండో వికెట్ కు అజేయంగా 77 పరుగులు జోడించి ఆసీస్ ను గెలిపించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 109 పరుగులకు ఆలౌట్ అవగా.. అంతకుముందు ఆస్ట్రేలియా 197 స్కోరు చేసి 88 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 163 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థికి చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది.
ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఆధిక్యాన్ని ఆసీస్ 2-1కి తగ్గించింది. దాంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 9 నుంచి జరుగుతుంది.