అవినీతికి వ్యతిరేకంగానే మా పోరాటం: కర్ణాటక సీఎం బొమ్మై!
- అవినీతి పరులు ఏ పార్టీ వారైనా విడిచి పెట్టేది లేదన్న సీఎం
- కాంగ్రెస్ హయాంలో లోకాయుక్తను మూసివేస్తే తాము తెరిపించామని వెల్లడి
- చాలా మంది కాంగ్రెస్ నేతలు తప్పించుకున్నారని వ్యాఖ్య
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం యుద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ ను విమర్శించారు. అవినీతి అభియోగాల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న సమయంలో లోకాయుక్తను రద్దు చేసినట్టు బొమ్మై చెప్పారు.
చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె.మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన తండ్రి కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం. దీనిపై సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవినీతికి పాల్పడే వారు ఎవరైనా కానీ, విడిచి పెట్టేది లేదన్నారు. నిందితుడు, అతడితోపాటు పట్టుబడిన డబ్బుపై లోతైన దర్యాప్తు చేస్తాం. కాంగ్రెస్ తన హయాంలో లోకాయుక్తను మూసివేస్తే.. మేము అధికారంలోకి వచ్చాక తిరిగి తెరిచాం. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పించుకున్నారు. ఇది అవినీతికి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటం’’ అని వివరించారు. మరోవైపు రిజర్వ్ బ్యాంకు కంటే బీజేపీ నేతల వద్దే అధిక కరెన్సీ ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.