భద్రత పెంచాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్.. విచారణ చేపట్టిన హైకోర్టు
- హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్న రేవంత్ రెడ్డి
- తగినంత భద్రత కల్పించడంలేదని కోర్టును ఆశ్రయించిన వైనం
- భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది
- భద్రత కల్పిస్తే ఇవాళ ఎందుకు విచారణ జరుపుతున్నామన్న హైకోర్టు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్ర సందర్భంగా తనకు మరింత భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.
వాదనల సందర్భంగా… రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రభుత్వం తగిన విధంగా భద్రత కల్పిస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. రేవంత్ పాదయాత్రకు గట్టి బందోబస్తు కల్పించాలని డీజీ ఇప్పటికే ఎస్పీలకు లేఖ పంపారని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ లేఖ ప్రతిని న్యాయమూర్తికి అందజేశారు.
అనంతరం, హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు చెబుతున్నట్టు రేవంత్ రెడ్డి పాదయాత్రకు తగిన విధంగా భద్రత కల్పిస్తే ఇవాళ ఎందుకు విచారణ జరుపుతున్నట్టు? అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఏ మేరకు భద్రత కల్పిస్తోందో తమకు సోమవారం నాడు చెప్పాలని రేవంత్ రెడ్డి న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.