నగ్మా డబ్బులు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు!
- నగ్మా ఇంటర్నెట్ అకౌంట్ లోకి లాగిన్ అయిన దుండగులు
- బెనిఫీషియరీ అకౌంట్ సృష్టించి డబ్బులు కొట్టేసిన వైనం
- అదృష్టం బాగుండి లక్ష మాత్రమే పోయాయన్న నగ్మా
మన దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు నగ్మా కూడా మోసపోయారు. ఆమె అకౌంట్ నుంచి లక్ష రూపాయలను కాజేశారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఆమెకు ఒక లింక్ వచ్చింది. ఆమె ఆ లింక్ పై క్లిక్ చేశారు. అనంతరం ఓ వ్యక్తి ఫోన్ చేసి కేవైసీ అప్ డేట్ చేయడానికి వివరాలు ఇవ్వాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన నగ్మా వివరాలను ఇవ్వలేదు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలు కొట్టేశారు.
ఈ ఘటనపై పోలీసులకు నగ్మా ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చినట్టు కాకుండా… బ్యాంకులు పంపించినట్టుగా మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. నగ్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నగ్మా అకౌంట్ ఉన్న అదే బ్యాంకుకు సంబంధించిన మరో 80 మంది కస్టమర్లు కూడా ఇదే విధంగా మోసపోయినట్టు తెలుస్తోంది.
దుండగులు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయ్యారని… ఆ తర్వాత బెనిఫీషియరీ ఖాతాను సృష్టించారని, లక్ష రూపాయలు బదిలీ చేశారని నగ్మా చెప్పారు. ఆ సమయంలో తనకు దాదాపు 20 ఓటీపీలు వచ్చాయని తెలిపారు. తన అదృష్టం బాగుండి లక్ష రూపాయలు మాత్రమే నష్టపోయానని చెప్పారు.