ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు బీఎల్ సంతోష్ కనిపించడం లేదంటూ పోస్టర్లు!
- తెలంగాణలో కలకలం రేపిన ఎమ్మెల్యేలకు ఎర అంశం
- బీజేపీ నేత బీఎల్ సంతోష్ సూత్రధారి అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు
- హైదరాబాద్ లో పలుచోట్ల వెలసిన పోస్టర్లు
బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీఎల్ సంతోష్ కనిపించడం లేదని పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు, ట్యాలెంటెడ్ ఇన్ ఎమ్మెల్యే పోచింగ్ అంటూ పోస్టర్లలో ఆయన గురించి విమర్శలు చేశారు. సంతోష్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 15 లక్షల బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ వాళ్లు చేసిన పనే అని మండిపడుతున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సూత్రధారి ఆయనే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సంతోష్ పై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తమ మాట వినకుండా విచారణ జరిపితే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరించింది.