- గత నెలలో లవ్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్
- లవ్ ప్రీత్… ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు
- లవ్ ప్రీత్ ను విడిపించుకునేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమృత్ పాల్
- పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిరసనకారులు
- చేసేదిలేక లవ్ ప్రీత్ ను విడిచిపెట్టిన పోలీసులు
- అమృత్ పాల్ పై కేసు నమోదు
గత నెలలో పంజాబ్ పోలీసులు లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ అనే వ్యక్తిని ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమ మద్దతుదారుడు అమృత్ పాల్ కు లవ్ ప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు. దాంతో, తన స్నేహితుడి కోసం అమృత్ పాల్ సింగ్ రంగంలోకి దిగాడు.
అమృత్ పాల్ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 24న అతడి మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు తీవ్ర భయానక పరిస్థితులు సృష్టించడంతో పోలీసులు నిస్సహాయులయ్యారు. చేసేదిలేక లవ్ ప్రీత్ సింగ్ ను విడిచిపెట్టారు. అయితే, దీనివెనుక ఉన్న మాస్టర్ మైండ్ అమృత్ పాల్ సింగ్ ను మాత్రం ఇవాళ సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
లవ్ ప్రీత్ ను విడిపించుకునేందుకు యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్ పాల్ సింగ్ పై కొన్ని వారాల కిందటే కేసు నమోదైంది. అయితే పంజాబ్ లో జీ-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూశారు. ఆ సదస్సు ముగియడంతో, పోలీసులు భారీ ఎత్తున వేట మొదలుపెట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో అమృత్ పాల్ సింగ్ పరారయ్యాడు.
అయితే పోలీసులు 100 కార్లతో అతడిని వెంటాడారు. ఎక్కడికక్కడ జిల్లాల సరిహద్దులను మూసేశారు… చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఛేజింగ్ కొన్ని గంటల పాటు సాగింది. చివరికి అతడిని జలంధర్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి మద్దతుదారులు ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.