Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ ఎంపీ పదవిపై అనర్హత వేటు …భగ్గుమన్న కాంగ్రెస్…

రాహుల్ ఎంపీ పదవిపై అనర్హత వేటు …భగ్గుమన్న కాంగ్రెస్…
-ప్రజాస్వామ్యానికి దుర్దినాలని ప్రతిపక్షాల మండిపాటు
-రాహుల్ గాంధీపై వేటు వేయడంపై ఖర్గే మమతా బెనర్జీ, స్టాలిన్ స్పందన!
-రాహుల్ వ్యాఖ్యల అంశం పరువు నష్టం కలిగించేంత పెద్దది కాదు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
-బీజేపీకి విపక్ష నేతలు ప్రధాన టార్గెట్ గా మారారన్న మమత
-ప్రజాస్వామ్యం మరింత దిగజారడాన్ని ఈరోజు చూశామని వ్యాఖ్య
–చివరకు న్యాయమే గెలుస్తుందన్న స్టాలిన్
-మోదీ అనే ఇంటిపేరుపై 2019లో రాహుల్ వ్యాఖ్యలు
-దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకుంటోందన్న రాహుల్
-నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశించి విమర్శలు
-రాహుల్ పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ 
-రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
-లోక్ సభ సభ్యుడిగా రాహుల్ పై అనర్హత వేటు

 

దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకుంటోంది అని  2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అప్పట్లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు చేశారు. అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పరారైన లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చెబుతోంది. 

అయితే ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, నిబంధనల ప్రకారం లోక్ సభ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

రాహుల్ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. 

నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర చాలా దారుణం అని ఖర్గే వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ… వీళ్లంతా బలహీన వర్గాల వారా? అని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ నాలుగేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దొంగలందరి పేరు వెనుక మోదీ ఉంటుందని అప్పట్లో రాహల్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. రాహుల్ పై వేటు పడిన నేపథ్యంలో బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

మోదీ కొత్త భారత్ లో బీజేపీకి విపక్ష నేతలు ప్రధాన టార్గెట్ గా మారారని మమత అన్నారు. నేరాలు చేసిన బీజేపీ నేతలు కేబినెట్లో ఉన్నారని… ఇదే సమయంలో ప్రసంగాలు ఇచ్చిన విపక్ష నేతలపై వేటు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత దిగజారడాన్ని ఈరోజు చూశామని అన్నారు.

స్టాలిన్ స్పందిస్తూ… ఒక చిన్న మాట అన్నందుకు రాహుల్ గాంధీ వంటి నేతపై వేటు వేయడం దారుణమని అన్నారు. కేవలం విమర్శనాత్మకంగా మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, వ్యక్తిగతంగా విమర్శించలేదని రాహుల్ కూడా వివరణ ఇచ్చారని చెప్పారు. సోదరుడు రాహుల్ తో తాను మాట్లాడానని, ఆయనకు తన సంఘీభావాన్ని ప్రకటించానని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

రాహుల్ గాంధీపై అనర్హతను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం: జైరాం రమేశ్

మోదీ అనే ఇంటిపేరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీగా అనర్హత వేటుకు గురికావడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ స్పందించారు.

రాహుల్ పై అనర్హత నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాల్సింది పోయి, రాహుల్ పై అనర్హత వేటు వేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి సమాధి కట్టారని మండిపడ్డారు. ఈ పరిణామంతో బెదిరిపోమని, తప్పనిసరిగా ఎలుగెత్తుతామని జైరామ్ రమేశ్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు.

అటు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. దేశంలో దొంగను దొంగ అనడం నేరంగా మారిందని పేర్కొన్నారు. దోపిడీదారులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, రాహుల్ పై మాత్రం వేటు వేశారని విమర్శించారు. రాహుల్ పై వేటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.

Related posts

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై బాలకృష్ణ స్పందన…

Drukpadam

ఇంతకీ షర్మిల ఎవరు వదిలిన బాణం…?

Drukpadam

కేసీఆర్ కు భారీగా సన్మానం చేస్తా … కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…

Drukpadam

Leave a Comment