టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!
- ఎమ్మెల్యేలకు ధర్మారెడ్డి గౌరవం ఇవ్వడం లేదన్న అన్నా రాంబాబు
- ఒంటెద్దు పోకడలకు పోతున్నారని విమర్శ
- ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్య
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు స్వామివారి దర్శనం కోసం వస్తున్న ఎమ్మెల్యేలకు ధర్మారెడ్డి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేలకు గౌరవం ఉండేదని… ఇప్పుడున్న ఈవో ఒంటెద్దు పోకడలకు పోతున్నారని విమర్శించారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీసును కూడా ధర్మారెడ్డి లెక్క చేయడం లేదని చెప్పారు. సామాన్య భక్తులను బూచిగా చూపిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తెలిపారు.
టీటీడీ ఈవోగా కొనసాగాలని ధర్మారెడ్డి ఎలా తపన పడుతున్నారో… స్వామిని దర్శించుకోవాలని తాము కూడా అంతే తపన పడుతున్నామని చెప్పారు. తిరుమల కొండకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఒకే నిబంధనను అమలు చేస్తే… తాము కూడా సామాన్య భక్తుడిలా స్వామిని దర్శనం చేసుకుంటామని తెలిపారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఈ ఉదయం అన్నా రాంబాబు తన కుటుంబంతో కలిసి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.